మీ చరిరత అందరికీ తెలుసు | - | Sakshi
Sakshi News home page

మీ చరిరత అందరికీ తెలుసు

Apr 4 2026 7:55 AM | Updated on Apr 4 2026 7:55 AM

మీ చరిరత అందరికీ తెలుసు ● మాపై ఆరోపణల మీద చర్చకు సిద్ధమా? ● మా హయాంలో అభివృద్ధిని చేసి చూపించాం ● చర్చకు వస్తే పూర్తి వివరాలతో చెబుతా ● ఎమ్మెల్యే జూలకంటికి పీఆర్కే సవాల్‌

మాచర్ల: ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మనందరెడ్డి చరిత్ర అందరికీ తెలుసని పల్నాడు జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక ఎమ్మెల్యే జూలకంటి తనపై రెండేళ్లలో అనేక రాజకీయ ఆరోపణలు చేశారని తెలిపారు. అక్రమంగా 16 కేసులు పెట్టించారన్నారు. హత్య కేసులో తనకు, తన సోదరుడికి ప్రమేయం లేకపోయినా అన్ని రకాలుగా ఇరికించి, వేధించారని మండిపడ్డారు. తనపై అనేక ఆరోపణలు చేస్తూ విషప్రచారం చేయటం అత్యంత దారుణమని పేర్కొన్నారు. శుక్రవారం ఆయన వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... ‘‘నేను నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వాడిని. ఒక్కసారికే గెలిచి నాపై విషప్రచారం చేస్తున్నావు. గుండ్లపాడు హత్య కేసులో నాకు, నా సోదరుడికి ప్రమేయం లేదు. విగ్రహాల చోరీ గురించి విమర్శించటం కాదు. మా ప్రమేయం లేదని తడిదుస్తులతో ఏ గుడిలోనైనా నేను ప్రమాణం చేస్తా. మా ప్రమేయం ఉందని ప్రమాణం చేస్తావా?. గుండ్లపాడులో నేను జెడ్పీటీసీ, ఎమ్మెల్యేగా ఉన్న కాలంలో ఫ్యాక్షన్‌ రాజకీయాలకు అవకాశమివ్వలేదు. 2009 వరకు రాజకీయాలలో ఉన్న నువ్వు ఆ తరువాత అనేక సంవత్సరాలు రాజకీయాలు వదిలి పారిపోయావు. చివరికి 2022లో ఇన్‌చార్జిగా వచ్చి ప్రతి గ్రామంలో చిచ్చు పెట్టి గొడవలు రేపావు. టెన్షన్‌ పెంచటం, దందాలు చేయటం, మీటింగ్‌లలో నీతివాక్యాలు చెప్పటం కాదు. ధైర్యముంటే అభివృద్ధిపై నేరుగా చర్చకు రావాలి. మేమెప్పుడూ ఫ్యాక్షన్‌ రాజకీయాలు ప్రోత్సహించలేదు. ఎన్నికలు జరిగిన 5, 6 రోజుల్లో కొంత మంది దూరంగా ఉండేవారు. కానీ నువ్వు గెలవగానే ఇప్పటికీ అరాచకాలతో, దౌర్జన్యాలతో గ్రామాలలో ఎస్‌సీ, ఎస్‌టీ, బీసీలను బతకనీయకుండా చేస్తున్నావు. ఈ రోజుకీ 566 కుటుంబాలు నియోజక వర్గానికి దూరంగా బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నాయి. వెల్దుర్తి, కారంపూడి, దుర్గి, మాచర్ల మండలాలలో అనేక గ్రామాలలో వారిని తరిమి కొట్టించావు. ఊళ్లలోకి వస్తే పోలీసులతో కొట్టించి బెదిరిస్తున్నావు. నీ సొంత గ్రామం వెల్దుర్తిలో 30 కుటుంబాలు దూరంగా బతుకుతున్నాయి. 2004 నుంచి ఇప్పటి వరకు మేం, మా కుటుంబమంతా దివంగత సీఎం వైఎస్సార్‌ ఆశయాలకు, ఆయన తనయుడైన వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ ఆశయాలకు అనుగుణంగా పనిచేశాం. మేమెవ్వరి మీద ఆధారపడలేదు. ఏ పార్టీని మోసం చేయలేదు.

అభివృద్ధికి పెద్దపీట వేశాం...

వెన్నుపోటు రాజకీయాలు మాకు తెలియవు. కుట్ర కేసులు మేం పెట్టించలేదు. జంట హత్యల కేసులో మమ్మల్ని జైలులో పెట్టి మానసికంగా ఇబ్బందులకు గురిచేశావు. ఇలా చేసి నువ్వు సాధించేది ఏదీ లేదు. 20 ఏళ్లు ఈ నియోజక వర్గానికి చేసిన అభివృద్ధి డేటాతో నేను సిద్ధం. వ్యవసాయ రంగంలో రూ. 175 కోట్లతో 33 సబ్‌ స్టేషన్లు నూతనంగా నిర్మించాను. రూ. 25 కోట్లతో 133/11 కేవీ సబ్‌ స్టేషన్‌లు నిర్మాణం చేశాం. 60 కి.మీ. తీర ఫేజ్‌ లైన్లకు నిధులు తెచ్చా. 38 రైతు భరోసా

కేంద్రాలను ఏర్పాటు చేసి రైతులకు అన్ని అందేలా చూశాం. వరికపూడిసెల సంబంధించి నేను చిత్తశుద్ధిలో జగన్‌ హయాంలో అనుమతులు తెచ్చా. నిధులు ఇచ్చాం. సీఎం చంద్రబాబు ఈ పథకం గురించి మోసం చేస్తున్నారు. 2017లో ఈ ప్రాజెక్టు గురించి అడిగితే సాధ్యం కాదన్నారు. అయినా వైఎస్‌ జగన్‌ అధికారంలోకి వచ్చాక అనుమతులు తెచ్చాం. పనులు చేపట్టడానికి సిద్ధమయ్యాం. వరికపూడిసెల నువ్వే తెచ్చినట్లు ఫీలవుతున్నావు. అమ్మ ఒడికి రూ. 139 కోట్లు వచ్చాయి. వసతి దీవెన, విద్యా దీవెనకు రూ. 82 కోట్లు, నాడు – నేడుకు రూ. వందల కోట్లు కేటాయించాం. మోడల్‌ స్కూల్స్‌, కస్తూరిబా, తాళ్ళపల్లిలో కేంద్రియ విద్యాలయం వంటి చేశాం. ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే.

ఇందుకు భిన్నంగా నువ్వు అధికారంలోకి వచ్చాక పట్టణ శివారులో ఓ రైస్‌ మిల్లులో అక్రమంగా నిల్వలు ఉంచి కాకినాడకు పంపటం లేదా? టిప్పర్‌ మట్టి కావాలన్నా నీ బినామీ అనుమతి కావాల్సిందే కదా? నువ్వు చేసే దందాలు, దౌర్జన్యాలు అందరికీ తెలుసు. మాచర్లలో ఉంటే నీతి వాక్యాలు చెబుతావు. గుంటూరుకు వెళ్లి అందరినీ బ్రతిమలాడుకొని కుట్రలు పన్నుతుంటావు. మా ఆస్తుల గురించి మాట్లాడావు. ఎన్నికల అఫడవిట్‌లో ఆస్తులేంటో చూసుకో. మాచర్ల, వెల్దుర్తిలో వెయ్యి ఎకరాలు ఆక్రమించానని చెబుతున్నావు. నా పేరు కానీ, బినామీ పేరు కానీ చూపించు. రూ.1000 కోట్లు, రూ.1500 కోట్లు సంపాయించానని ఆరోపించడం తగదు. అంతెందుకు రూ. 500 కోట్లు సంపాదన నాకు వచ్చి ఉంటే నీకే రాసిస్తా. అందులో 20 శాతం ఇస్తే చాలు ఎక్కడ సంతకాలు పెట్టమంటే అక్కడ పెడతా. మిగిలింది నువ్వే తీసుకో. వీటన్నింటికి నేను సిద్ధం. మమ్మల్ని, కార్యకర్తలు, నాయకులను ఇబ్బందులు పెట్టిన వారిని నేను వదలను. నువ్వు బెదిరించినట్లు తాటతీస్తా.. తోలు వలుస్తా.. మాటలు కాదు. నీకు చేతనైతే అభివృద్ధి చెయ్యి. పనికిమాలిన మాటలు మాట్లాడి అక్రమ కేసులు పెట్టి సాఽధించేది ఏమీ లేదు. మూల్యం చెల్లించేలా తప్పకుండా చర్యలు తీసుకుంటా.’’ అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement