భక్తుల భద్రతే ధ్యేయంగా ఏర్పాట్లు
జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా,
ఎస్పీ కృష్ణారావు
నరసరావుపేట: మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని కోటప్పకొండకు వచ్చే భక్తుల సౌకర్యం, భద్రతే ధ్యేయంగా జిల్లా యంత్రాంగం, దేవస్థానం అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా పేర్కొన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లో ఎస్పీ బి.కృష్ణారావుతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఈ ఏడాది భక్తుల సంఖ్య గతేడాది కంటే 30 శాతం అధికంగా ఉంటుందని, సుమారు 1.50 లక్షలకు పైగా భక్తులు దర్శనానికి వస్తారని అంచనాతో ఏర్పాట్లుచేస్తున్నామన్నారు. భక్తుల సౌకర్యార్థం ప్రధానంగా శనివారం అర్ధరాత్రి (తెల్లవారితే శివరాత్రి) ఒంటి గంట నుంచే దర్శనాలు ప్రారంభమవుతాయని, సాధారణ భక్తుల కోసం ప్రత్యేక ఉచిత క్యూలైన్లు ఏర్పాటుచేశామన్నారు. ఆన్‌లైన్‌లో అన్ని రకాల టికెట్లతోపాటు రూ.300 వీఐపీ టికెట్లు 14వ తేదీ వరకు అందుబాటులో ఉంటాయని, కొండపై కౌంటర్లలో రూ.100, రూ.200, రూ.500 టికెట్లు ఆఫ్‌లైన్‌లో సైతం లభిస్తాయన్నారు. దర్శనం చేసుకున్న ప్రతి భక్తుడికి 20 గ్రాముల లడ్డూ ఉచితంగా అందజేస్తారని, లడ్డూ కొనుగోలు చేసేందుకు 10 ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పర్వదినాన పలు ప్రాంతాల నుంచి మొత్తం 618 ప్రత్యేక బస్సులు నడుపుతున్నామని, ఇందులో కొండపైకి భక్తులు వెళ్లేందుకు 120 బస్సులు నిరంతరం అందుబాటులో ఉంటాయన్నారు. ఆధార్‌కార్డు ఉన్న ప్రతి మహిళకు సీ్త్రశక్తి పథకం కింద ఉచిత ప్రయాణం ఉంటుందని పేర్కొన్నారు. భక్తుల కోసం 6 లక్షల వాటర్ బాటిళ్లు, లక్షకు పైగా మజ్జిగ ప్యాకెట్లు, లక్ష బిస్కెట్లు ప్యాకెట్లు సిద్ధం చేశామన్నారు. ఎండ తీవ్రత దృష్ట్యా షేడ్ నెట్‌లు ఏర్పాటు చేశామని, 10 మెడికల్ క్యాంపులు, 170 మంది వైద్య సిబ్బంది, ఎనిమిది అంబులెన్సులు అందుబాటులో ఉంటాయని అన్నా రు. 440 మంది సిబ్బందితో నిరంతర పారిశుద్ధ్య పనులు నిర్వహిస్తామని, 16వ తేదీ వరకూ పారిశుద్ధ్య కార్యక్రమాలు జరుగుతుంటాయన్నారు.
2500 మంది సిబ్బందితో బందోబస్తు
జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ కృష్ణారావు మాట్లాడుతూ భక్తుల రక్షణ కోసం 2500 మంది పోలీస్ సిబ్బంది, తొమ్మిది ప్రత్యేక బలగాలతో బందోబస్తు ఏర్పాటుచేసినట్లు తెలిపారు. కొండపైన, దిగువన 100 సీసీ కెమెరాలు, 30 డ్రోన్ల తో నిరంతర పర్యవేక్షణ ఉంటుందన్నారు. దొంగతనాల నివారణకు మఫ్టీలో క్రైమ్ టీమ్స్ నిత్యం పహారా కాస్తాయన్నారు. నరసరావుపేట, వినుకొండ నుంచి వచ్చే వారు పెట్లూరివారిపాలెం దారిలో రావాలని, చిలకలూరిపేట భక్తులకు శారదా ఫార్మసీ కాలేజీ వద్ద పార్కింగ్ ఏర్పాటుచేశామని, యల్లమంద, గురవయ్యపాలెం దారిలో వచ్చే భక్తులకు యాదవ, రెడ్ల సత్రాల పక్కగా పార్కింగ్ ఏర్పాటుచేసినట్లు తెలిపారు. 26 విద్యుత్ ప్రభలు, 3 ఇతర ప్రభలు కొండకు వచ్చేందుకు నమోదు చేసుకున్నాయన్నారు. అత్యవసర సహాయం కోసం 94409 00885నంబరులో సంప్రదించాలని సూచించారు.


