నేడు ఏపీ బార్ కౌన్సిల్ ఎన్నికలు
నరసరావుపేట: స్థానిక బార్ అసోసియేషన్ హాలులో శుక్రవారం ఏపీ బార్ కౌన్సిల్ ఎన్నికలు జరగనున్నాయి. ఓటింగ్‌లో పాల్గొనేందుకు స్థానిక న్యాయవాదులు సమాయుత్తమయ్యారు. బార్ కౌన్సిల్‌కు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన 23 మంది న్యాయవాదులు పోటీ చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో స్థానిక బార్ అసోసియేషన్‌కు చెందిన 303 మంది న్యాయవాదులు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ప్రతి ఒక్కరూ బ్యాలెట్ పేపర్‌పై ఐదుగురికి తప్పనిసరిగా ఓటు వేయాల్సి ఉంటుంది. తాము ఎంపిక చేసుకున్న అభ్యర్ధులకు ఆంగ్లంలో ఓఎన్‌ఇ ఒన్, టీడబ్ల్యుఓ టు అంటూ ఐదుగురి పేర్లు ఎదుట ఆంగ్లంలో రాస్తేనే ఆ ఓటుకు విలువ ఉంటుందని, లేనిపక్షంలో ఇన్‌వాలిడ్ ఓటుగా పరిగణిస్తారని సీనియర్లు తెలియచేస్తున్నారు. ఓటింగ్ ప్రక్రియకు కావాల్సిన ఏర్పాట్లను సాయంత్రం నుంచి బార్ అసోసియేషన్ హాలు వద్ద చేపట్టి పూర్తిచేశారు. గత కొన్నిరోజులుగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి బార్ కౌన్సిల్‌కు పోటీ చేస్తున్న పలువురు సీనియర్ న్యాయవాదులు స్థానిక బార్‌కు స్వయంగా వచ్చి న్యాయవాదులను కలిసి తమకు మద్దతు తెలియచేయాలని అభ్యర్ధించారు. పోటీలో ఉన్న గుంటూరుకు చెందిన పలువురు న్యాయవాదులకు మద్దతుగా స్థానిక న్యాయవాదులు ప్రచారం చేస్తూ తమ మద్దతుదార్లను కూడగట్టే పనిలో నిమగ్నమయ్యారు.
సమాయత్తమైన స్థానిక న్యాయవాదులు


