కారులో చెలరేగిన మంటలు
మంగళగిరి టౌన్: కారులో మంటలు చెలరేగి కారు దగ్ధమైన ఘటన మంగళగిరి పట్టణంలో బుధవారం చోటుచేసుకుంది. సేకరించిన వివరాల మేరకు అనంతపూర్‌కు చెందిన ఆదిత్య జగ్గయ్యపేటలోని కెనరా బ్యాంకులో ఉద్యోగం చేసుకుంటున్నాడు. గుంటూరులో ఉన్న కెనరా బ్యాంక్ బ్రాంచ్‌లో బ్యాంకుకు సంబంధించిన ఇంటర్వ్యూకు హాజరయ్యేందుకు బుధవారం తన కారులో వచ్చాడు. తిరిగి వెళ్లే క్రమంలో తాడేపల్లిలోని బంధువుల ఇంటికి వెళుతుండగా మంగళగిరి రత్నాల చెరువు జాతీయ రహదారి వద్దకు వచ్చేసరికి రాత్రి 7.30 గంటలు అయ్యింది. ఈ క్రమంలో కారు బ్యానెట్‌లో నుంచి పొగలు రావడం ఆదిత్య గమనించాడు. వెంటనే కారు పక్కన ఆపి కారులో నుంచి దిగాడు. క్షణాల్లో కారులో మంటలు భారీగా వ్యాపించాయి. అగ్నిమాపక సిబ్బందికి, పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపుచేశారు. అప్పటికే కారు దాదాపుగా దగ్ధమైపోయింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ఘటన చోటుచేసుకుని ఉండవచ్చని, సుమారు 4 లక్షల వరకు నష్టం జరిగి ఉండవచ్చని అగ్నిమాపక సిబ్బంది అంచనా వేశారు.


