ప్రైవేట్ భాగస్వామ్యంతో
సాంస్కృతిక పోటీల విజేతలు
● కేంద్ర సహాయ మంత్రి డాక్టర్
పెమ్మసాని చంద్రశేఖర్
● ప్రారంభమైన కొండవీడు ఫెస్ట్–2026
టూరిజం అభివృద్ధి
యడ్లపాడు: ప్రభుత్వం వద్ద నిధులు లేవని, ప్రైవేటు భాగస్వామ్యంతో టూరిజం అభివృద్ధికి తోడ్పాటు ఇవ్వాలనుకుంటున్నామని కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. చారిత్రక ప్రదేశం కొండవీడు కోట ఉత్సవాలు శనివారం ప్రారంభమయ్యాయి. కొండవీడు ఫెస్ట్–2026 పేరిట జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా, స్థానిక ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ ఉత్సవాలకు కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర దేవదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయులు తొలిరోజు ఉత్సవాలను ప్రారంభించారు. ముందుగా కొత్తపాలెం వాసులు ఘాట్‌రోడ్డుకు వెళ్లే మార్గంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే ప్రత్తిపాటి అరకు కాపీ సెంటర్‌ను ప్రారంభించారు. అక్కడ నుంచి కలెక్టర్, ఆర్డీవో మధులతతో కలసి హెలీప్యాడ్ ప్రాంతానికి చేరుకుని, భద్రత వివరాలను తెలుసుకుని హెలీప్యాడ్‌ను ప్రారంభించాలని ఆదేశించారు. కొండపై స్వాగత ద్వారం వద్ద కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని, రాష్ట్ర మంత్రి ఆనం, ఎంపీ, ఎమ్మెల్యేలతో కలసి ఉత్సవాలను లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం కోటలోకి ప్రవేశించి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో పూజలు చేశారు. కొండపై ఏర్పాటు చేసిన వివిధ స్టాళ్లను ప్రారంభించి పరిశీలించారు. వెదుళ్ల చెరువును సమీపించి బోటింగ్ చేశారు. చివరిగా సభావేదిక వద్దకు చేరుకుని కల్చరల్ సెంటర్ ఆఫ్‌ది విజయవాడ సీఈవో డాక్టర్ ఈమని శివనాగరెడ్డి ‘అమరావతికి సరిజోడు కొండవీడు’ చరిత్ర పుస్తకం, యడ్లపాడు నారాయణ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ప్రిన్సిపాల్ రూపొందించిన కొండవీడు ప్రత్యేక గీతం, బకిం చంద్ర చటర్జీ రాసిన వందేమాతరం గీతం 150 ఏళ్లు పూర్తి అయిన సందర్భంగా ఈ గీతాన్ని ఆవిష్కరించారు. టీడీపీనేత నన్నపనేని రాజకుమారి, శిల్పారామం చైర్మన్ పద్మజారెడ్డి, డీఎఫ్‌వో జి కృష్ణప్రియ, గ్రంథాలయ చైర్మన్ కోటేశ్వరరావు, వివిధ శాఖలకు చెందిన జిల్లా మండలస్థాయి అధికారులు పాల్గొన్నారు. మంత్రి పెమ్మసాని మాట్లాడుతూ గోల్కొండ గ్రూప్స్ అధినేత నడికట్టు రామిరెడ్డి కొండవీడులో రీసార్ట్ నిర్మాణానికి రూ.వంద కోట్లు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని, అటవీశాఖ అనుమతుల్ని తీసుకుంటామని తెలిపారు. రామిరెడ్డి మాట్లాడుతూ సమగ్రంగా ప్రాజెక్టు రిపోర్టు రూపొందిస్తే రూ.100 కోట్ల వెచ్చించేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. మంత్రి ఆనం మాట్లాడుతూ పూర్వ ఎలాంటి సాంకేతిక లేని రోజుల్లో మూడు చెరువులు ఒకదాని తర్వాత మరొకటి నిండేలా చేయడం నాటి రాజుల దూరదృష్టికి దర్పణం అన్నారు. శివాలయం పునర్నిర్మాణానికి నిధులు కేటాయించేలా కృషి చేస్తామన్నారు. ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయులు మాట్లాడుతూ బాల్య దశలోనే ఇలాంటి ప్రాంతాలకు పిల్లలను తీసుకెళ్లి గత చరిత్ర, సంస్కృతి గురించి తెలియజేయాల్సిన బాధ్యత పెద్దలపై ఉందన్నారు. ముందుగా నరసరావుపేట, యడ్లపాడు ప్రాంతాలకు చెందిన వివిధ పాఠశాలల విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక ప్రదర్శనలు అందర్నీ ఆకట్టుకున్నాయి.
కొండవీడు ఉత్సవాల్లో భాగంగా వివిధ పాఠశాలల విద్యార్థులకు పలు విభాగాల్లో అధికారులు పోటీలు నిర్వహించారు. ఆయా విభాగాల్లో విజేతలకు జ్ఞాపికలను అతిథుల చేతుల మీదుగా అందించి అభినందించారు. విజేతల వివరాలు..నృత్య విభాగంలో..ఎన్.ముత్యాలు, శాసీ్త్రయ నృత్యం, నారాయణ ఇ.ఎమ్ స్కూల్, యడ్లపాడు, మున్సిపల్ బాయ్స్ హైస్కూల్, నరసరావుపేట. పాటల పోటీల్లో..ఆంధ్రా స్కూల్, నరసరావుపేట, ఎంజేపీఎపీబీసీడబ్ల్యూసిడెన్షియల్ స్కూల్, నరసరావుపేట, సెయింట్ జోసెఫ్ హైస్కూల్, నరసరావుపేట, వక్తృత్వంలో...సెయింట్ జోసెఫ్ హైస్కూల్, చిత్రలేఖన పోటీల్లో...ఎంజేపీఎపీబీసీడబ్ల్యూ రెసిడెన్షియల్ స్కూల్, నరసరావుపేట, సెయింట్ జోసెఫ్ హైస్కూల్, నరసరావుపేట, హర్డ్ హైస్కూల్, నరసరావుపేట విద్యార్థులు వరుసగా ప్రథమ, ద్వితీయ, తృతీయస్థానాల్లో నిలిచినట్లు అధికారులు తెలిపారు.
ప్రైవేట్ భాగస్వామ్యంతో


