తప్పులపై తప్పులు చేస్తున్న చంద్రబాబు
● ఎన్‌డీడీబీ నివేదికతో చెంపలేసుకొని
భగవంతుడిని క్షమాపణ కోరాలి
● వైఎస్సార్ సీపీ వారికి సంబంధం
ఉన్నట్లు సీబీఐ నివేదిక ఎక్కడా చెప్పలేదు
● 2018కు చెందిన హర్ష డెయిరీనే
నేటి బోలేబాబా డెయిరీ
● విలేకర్ల సమావేశంలో
మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి
నరసరావుపేట: టీటీడీ లడ్డూ ప్రసాదంపై చేసిన తప్పును కప్పిపుచ్చుకోవడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు తప్పుల మీద తప్పులు చేస్తున్నాడని, ఇకనైనా ఆ అంశానికి తెరదించి ఆ దేవదేవుడికి క్షమించమని లెంపలేసుకుని వేడుకోవాలని జిల్లా వైఎస్సార్ సీపీ కార్యనిర్వాహక అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. శనివారం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ఎన్‌డీడీబీ, ఎన్‌డీఆర్‌ఐ ల్యాబ్‌లు తిరుమల నెయ్యిలో ఎటువంటి జంతు సంబంధమైన కొవ్వు కలవలేదని నివేదిక ఇచ్చినప్పటికీ ఇంకా అబద్ధాలు చెప్పటం మానలేదని అన్నారు. 2018లో టీడీపీ హయాంలో హర్ష డెయిరీ పేరుతో నెయ్యి టీటీడీకి సరఫరా చేసిన సంస్థే పేరుమార్చుకొని ఇప్పుడు బోలెబాబా పేరుతో నెయ్యి సరఫరా చేస్తోందన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే జరిగిందనేది వాస్తవం అన్నారు. చంద్రబాబు ఇప్పుడు కొత్తగా మతాన్ని తెరపైకి తీసుకొచ్చి నాటకాలు మొదలుపెట్టాడని విమర్శించారు. ఏకసభ్య కమిషన్ నియమిస్తానని చంద్రబాబు చెబుతున్నాడని, ఇది కేవలం వైఎస్ జగన్ లడ్డూ కల్తీ చేయించారని రాయించుకోవడం కోసమేనని అన్నారు. అయోధ్యకు పంపిన 1.25 లక్షల లడ్డూల్లో కల్తీ జరిగిందని డెప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడారని, వాస్తవానికి ఇండియన్ ఎక్స్‌ప్రెస్ పత్రికలో అయోధ్యకు పంపించిన లడ్డూలు 4వేల కేజీల నెయ్యితో టీటీడీ ట్రస్ట్ బోర్డు మెంబర్లు సౌరబ్ బోరా, మై హోం రామేశ్వరరావులు కలిసి తయారు చేయించి పంపించారని ఇది కూడా పవన్ కళ్యాణ్ తెలియదా అని ప్రశ్నించారు. అనిల్‌కుమార్ సింఘాల్ తప్పు చేశారని చెప్పిన చంద్రబాబు తిరిగి ఆయన్నే ఎందుకు నియమించారని ప్రశ్నించారు. రూ.265 కోట్లు వైఎస్సార్ సీపీ వాళ్లు ఈ వ్యవహారంలో దోచుకున్నారని మాట్లాడారని, సిట్ దర్యాప్తులో ఎక్కడ కూడా వారి పేర్లు ప్రస్తావించలేదన్నారు. సమావేశంలో ఇంటలెక్చ్యువల్ ఫోరం రాష్ట్ర కార్యదర్శి ఇయం.స్వామి మాట్లాడగా, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి గంటెనపాటి గాబ్రియేలు, మాజీ కౌన్సిలర్ బత్తుల పద్మలత పాల్గొన్నారు.


