నీరు పెట్టేందుకు వెళ్లిన రైతు కూలీ మృతి
పిడుగురాళ్ల: పొలానికి నీరు పెట్టేందుకు వెళ్లిన రైతు కూలీ అకురాజుపల్లి మేజర్ కాలువ దోనెలో ఇరుక్కొని మృతి చెందాడు. వివరాల ప్రకారం...మాచవరం మండలం కొత్త గణేశునిపాడు గ్రామానికి చెందిన కొంత మంది రైతులు తమ పంట పొలాలకు నీళ్లను మళ్లించుకునేందుకు బ్రాహ్మణపల్లి వద్ద గల అకురాజుపల్లి మేజర్ కాలువ వద్దకు వెళ్లారు. మేజర్ కాలువలో నీళ్లను కొత్తగణేశునిపాడు గ్రామానికి మరల్చే ప్రయత్నంలో ఆకురాజుపల్లి మేజర్‌కాలువ, కొత్త గణేశునిపాడు గ్రామ కాలువకు మధ్యలో ఉన్న దోనెలో నీటి ప్రవాహాన్ని పరిశీలించేందుకు కొత్తగణేశునిపాడు గ్రామానికి చెందిన రైతు కూలీ మల్లెల ధనుంజయరావు (43) వెళ్లాడు. వెళ్లిన వ్యక్తి ఎంత సేపటికి రావటం లేదని చూడగా, దోనె లోపల ధనుంజయరావు మృతి చెంది కనిపించాడు. వెంటనే రైతులు పిడుగురాళ్ల పట్టణ సీఐ శ్రీరాం వెంకట్రావుకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని గురజాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించినట్లు సీఐ తెలిపారు.


