ఫైనాన్స్ ఎగ్గొట్టి.. నెంబర్లు మార్చి
నకిలీ నెంబర్ ప్లేట్‌తో అక్రమంగా తిరుగుతున్న కార్లు చోళమండల్ ఫైనాన్స్ ప్రతినిధి ఫిర్యాదుతో వెలుగులోకి కేసు నమోదు చేసిన నరసరావుపేట వన్‌టౌన్ పోలీసులు
నరసరావుపేట టౌన్: కారుపై తీసుకున్న ఫైనాన్స్‌ను ఎగ్గొట్టేందుకు నెంబర్ మార్చి తిరుగుతున్నట్టు చోళమండల్ ఫైనాన్స్ కంపెనీ ఏరియా మేనేజర్ భరత్ కుమార్ ఇచ్చిన ఫిర్యాదుతో నరసరావుపేట వన్‌టౌన్ పోలీసులు శనివారం కేసు నమోదు చేశారు. తమ సంస్థ నుంచి మూడు కార్లకు రుణం పొందిన ముగ్గురు వ్యక్తులు వాయిదాలు సక్రమంగా చెల్లించడం లేదు. వాహనాలకు నకిలీ నెంబర్లు అంటించి తిరుగుతున్నారు. ఈ వ్యవహారంపై విచారణ జరిపి కారు రుణం తీసుకున్న వారితో పాటు ప్రస్తుతం కార్లను తిప్పుతున్న మరో ముగ్గురిపై చర్యలు తీసుకోవాలని భరత్ కుమార్ ఫిర్యాదులో పేర్కొన్నాడు. దీంతో ఆరుగురుపై కేసు నమోదు చేసి మూడు కార్లను స్వాధీనం చేసుకున్నారు.
రూరల్ స్టేషన్‌కు చేరిన కార్ల పంచాయితీ...
చిలకలూరిపేట హైవే ప్రమాదంలో ఐదుగురు విద్యార్థుల మృతి కేసులో ప్రధాన నిందితుడు ఏఎస్‌ఐ కుమారుడు వెంకట్‌నాయుడు వినియోగించిన నకిలీ నెంబర్ కారు వ్యవహారంతో నకిలీ కార్ల గుట్టు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తోంది. నకరికల్లుకు చెందిన అంజి, భానులు తనకు కారు విక్రయించారని చెప్పడంతో వారిద్దర్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. గతంలో వీళ్లు ఇద్దరు విక్రయించిన సుమారు 23 కార్లను స్వాధీనం చేసుకొని రూరల్ పోలీసుస్టేషన్‌కు తరలించారు. ప్రస్తుతం కార్లను వినియోగిస్తున్న యజమానుల దగ్గర ఉన్న పత్రాలు, కారు బాడీపై చాయిస్ నెంబర్లను పరిశీలించారు. అవి నకిలీవా కాదా అన్నది నిగ్గుతేల్చమని రవాణాశాఖ అధికారులను కోరారు. వీటిని పరిశీలించిన అధికారులు మూడు కార్లకు నకిలీ నెంబర్లు అంటించి వినియోగిస్తున్నట్టు ప్రాథమికంగా గుర్తించారు.
అనుమానాలకు తావిస్తున్న అధికారుల తీరు..
అధికారపార్టీకి చెందిన ఓ ప్రజాప్రతినిధి కాన్వాయ్‌లో నకిలీ కార్ల గ్యాంగ్ అందజేసిన ఓ కారు తిరుగుతున్నట్టు విచారణలో తేలింది. దీంతో పాటు పలువురు పోలీసు అధికారులు వీరి వద్ద నుంచి కార్లు కొనుగోలు చేసినట్టు నిందితుల నుంచి తెలుసుకున్నారు. అయితే ఆ కార్లను వదలిపెట్టి మిగిలిన కార్లను మాత్రమే విచారణకు స్టేషన్‌కు తీసుకురావడం పలు ఆరోపణలకు తావిస్తోంది. ఇప్పటికే నకిలీ కార్ల వ్యవహారంలో ఎస్‌ఐ, ఏఎస్‌ఐ సస్పెండ్ కాగా, మరో నలుగురు సిబ్బందిని బదిలీ చేసిన విషయం తెలిసిందే. కారు కొనుగోలు చేసిన పోలీసు అధికారులపై ఉన్నతాధికారులు ఏ రకమైన చర్యలు తీసుకుంటారో వేచిచూడాల్సి ఉంది.


