క్రమశిక్షణకు ప్రతీక క్రీడలు
భాష్యం స్పోర్ట్స్ మీట్‌లో వక్తలు
గుంటూరు ఎడ్యుకేషన్: క్రీడలు కేవలం పతకాలు, ట్రోఫీల కోసం మాత్రమే కాదని, అవి విద్యార్థుల్లో క్రమశిక్షణ, జట్టుగా పనిచేసే తత్వం, ఓర్పు, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తాయని గుంటూరు జిల్లా అగ్నిమాపక విపత్తు స్పందన అగ్నిమాపకశాఖాధికారి ఎం.శ్రీనివాసరెడ్డి అన్నారు. వికాస్‌నగర్‌లోని వికాస్ గ్రౌండ్‌లో భాష్యం ఒలంపస్ పేరుతో నిర్వహిస్తున్న జోనల్‌స్థాయి వార్షిక స్పోర్ట్స్ మీట్ శనివారం రెండు రోజు కొనసాగింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ జీవితంలో ఎదురయ్యే సవాళ్ళను ఎలా ఎదుర్కోవాలో క్రీడలు నేర్పిస్తాయన్నారు. గెలుపోటములు సహజమని, పాల్గొనడమే ముఖ్యమన్నారు. ప్రతి ప్రయత్నం మిమ్మల్ని ఉన్నత వ్యక్తిగా తీర్చిదిద్దుతుందన్నారు. మరో అతిథి డాక్టర్ లావణ్య మాట్లాడుతూ విద్యార్థుల జీవితంలో తరగతి గదులు మేధస్సును పెంచితే, ఆట స్థలాలు వారి వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుతాయని పేర్కొన్నారు. ఈ సందర్భంగా భాష్యం సాంబశివపేట, ఆర్టీసీ కాలనీ, ఎస్వీఎన్ కాలనీ, పట్టాభిపురం, నగరాలు క్యాంపస్‌లకు చెందిన ప్రైమరీ విద్యార్థులకు క్రీడాపోటీలు నిర్వహించి, విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో జెడ్‌ఈవోలు శివ, స్వప్న, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.


