గుంటూరు జిల్లా పసుపు రైతులకు దక్కిన భరోసా
వైఎస్ జగన్ ప్రభుత్వంలో బీమా కేటగిరీ మార్పుతో పసుపు రైతులకు పరిహారం అదే తొలిసారి ఎకరాకు రూ.58 వేల చొప్పున అందిన పరిహారం కొల్లిపర మండలంలోనే రూ.10 కోట్ల వరకు దక్కిన బీమా
తెనాలి: భారతీయులు శుభప్రదంగా భావించే పసుపు పంట సాగుచేసే రైతులకు ఏటా కష్టాల కడగండ్లు ఎదురయ్యేవి. ఆటుపోట్ల మధ్య సంప్రదాయంగా పసుపు సాగుచేసే రైతులకు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో భరోసా దక్కింది. మార్కెట్ ధర పతనమైనపుడు మద్దతు ధరకు కొనుగోలు చేయటమే కాదు, ఉచిత బీమాతో అధికవర్షాలతో దెబ్బతిన్న పంటకు భారీ పరిహారం అందించారు నాటి సీఎం వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి.
తీవ్ర నిరాశలో ఉన్న రైతులకు..
ఉమ్మడి గుంటూరు జిల్లాలో పసుపు పంటను 13 వేల ఎకరాల విస్తీర్ణంలో సాగుచేస్తుంటారు. ఏటా 35 వేల టన్నుల వరకు దిగుబడి వస్తోంది. ఎకరాకు కనీసం రూ.1.50 లక్షల వరకు పెట్టుబడి పెడుతున్నారు. పంట చేతికొచ్చేసరికి మార్కెట్ మాయాజాలం నిరాశపరుస్తోంది. ప్రకృతి వైపరీత్యాలకు దెబ్బతిన్న పసుపు పంటకు నష్టపరిహారం సంగతి దేవుడెరుగు! అన్నట్టుగా ఉండేది. ఇలాంటి నేపథ్యంలో జిల్లాలో 2021–22 ఖరీఫ్ సీజనులో సాగుచేసిన పసుపు పైరు అధికవర్షాలు, వరదలకు దెబ్బతింది. ఎప్పటిలాగే పరిహారం రాదనుకుని తీవ్ర నిరాశలో ఉండిపోయారు. ఆ సమయంలో జిల్లాలోని దాదాపు 9వేల మంది పసుపు రైతులకు నాటి జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం బీమా పరిహారం అందించింది. ఎకరాకు రూ.52,800 చొప్పున, లంక గ్రామాల్లో రూ.75 వేల వరకు అందటంతో రైతులు సంభ్రమాశ్చర్యాలకు గురయ్యారు. రెండుమూడేళ్లకోసారి ప్రకృతి విపత్తులకు పసుపు దెబ్బతినటం సాధారణమే అయినా, బీమా పరిహారం అందటం అదే తొలిసారి. అదికూడా ఎకరాకు భారీ మొత్తం రావటంతో రైతుల ఆనందం అంతా ఇంతా కాదు. పసుపు విస్తీర్ణం ఎక్కువంగా ఉండే కొల్లిపర మండల రైతులకు దాదాపు రూ.10 కోట్ల వరకు బీమా డబ్బులు అందాయి. అంతేకాదు...మార్కెట్ ధరల మాంద్యం ఫలితంగా రైతుల దగ్గరే నిల్వ ఉండిపోయిన పసుపు పంటను క్వింటాలుకు రూ.6,850 చొప్పున ప్రభుత్వమే కొనుగోలు చేయటం మరో విశేషం! అప్పట్లో క్వింటాలు ధర రూ.5 వేలకు పతనమైంది. ఇంతగా తమను ఆదుకున్న వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి రైతులు ధన్యవాదాలు చెబుతున్నారు.


