బండరాళ్లు మోపి వ్యక్తి హత్య
తండ్రి ఫిర్యాదుతో కేసు నమోదు వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్న పోలీసులు
తాడేపల్లి రూరల్: బండరాళ్లు మోపి వ్యక్తిని హత్య చేసిన ఘటన శనివారం తాడేపల్లిలో ఘటన చోటుచేసుకుంది. వివరాలు.. తాడేపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలోని అంజిరెడ్డి కాలనీ, కొలనుకొండ గ్రామాలను కలిపే రహదారిలో పంట పొలాల మధ్యలో మృతదేహం ఉన్నట్లు ఓ రైతు గుర్తించి తాడేపల్లి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఘటనా స్థలానికి వెళ్లిన పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. చనిపోయిన వ్యక్తి ఆటోడ్రైవర్ ఇళ్లచెరువు వెంకట్(30)గా గుర్తించారు. వెంకట్ బ్రహ్మానందపురంలో నివాసముంటున్నాడని, అంజిరెడ్డి కాలనీలో రెండో భార్య ఉంటోందని స్థానికుల ద్వారా గుర్తించారు. అంజిరెడ్డి కాలనీకి సమీపంలో ఈ హత్య జరగడంతో అక్కడే నివసిస్తున్న వెంకట్ రెండవ భార్య శిరీషకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి వెళ్లి మృతిచెందిన వ్యక్తి వెంకట్ అని పోలీసులకు తెలిపింది. ఆమె మొదటి భార్య సాయిదుర్గకు సమాచారం ఇచ్చింది. మొదటి భార్య ఘటనా స్థలానికి తన ఇద్దరు ఆడపిల్లలతో కలసి వచ్చి భర్త మృతదేహాన్ని చూసి బోరున విలపించింది. ఘటనా స్థలానికి గుంటూరు నుంచి వచ్చిన వెంకట్ తండ్రి వెంకటేశ్వర్లు తమ కొడుకుని గుర్తుతెలియని వ్యక్తులు దారుణంగా కొట్టి, తలపై రాయిమోపి చంపినట్లు ఫిర్యాదు చేశాడు. వెంకట్ రెండవ భార్య విషయంలో మొదటి భార్య వెంకట్‌తో గొడవ పడింది. అనంతరం ఆమె దగ్గరకు వెళ్లనని వెంకట్ చెప్పినట్లు తెలియవచ్చింది. రెండవ భార్య శిరీష నా భర్తను అంజిరెడ్డి కాలనీకి చెందిన వారే పాత కక్షలు మనసులో పెట్టుకుని హత్యచేశారని, గతంలో నా భర్తను, నన్ను చంపడానికి ప్రయత్నించిన ఆ ముగ్గురే ఈ దారుణానికిఒడిగట్టారని, వెంటనే పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని విచారించాలని ఆమె డిమాండ్ చేసింది. ఇదే క్రమంలో మొదటి భార్య సాయిదుర్గ, రెండవ భార్యగా చెప్పుకుంటున్న శిరీషనే ఈ హత్య చేయించిందని ఆరోపిస్తోంది.
దర్యాప్తు చేపట్టిన పోలీసులు....
వెంకట్ తండ్రి దగ్గర ఫిర్యాదు అందుకున్న తాడేపల్లి సీఐ వీరేంద్ర విచారణ చేపట్టారు. పోలీసులు ఇప్పటికే నలుగురు యువకులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. గురువారం రాత్రి వెంకట్ రెండవ భార్య దగ్గర నుండి మొదటి భార్య దగ్గరకు వెళుతుండగా మార్గం మధ్యలో నడిరోడ్డుపై పుట్టినరోజు వేడుకలు జరుపుకున్న కొంతమంది యువకులతో ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణ నేపథ్యంలో వెంకట్‌ను హత్యచేసినట్లు విశ్వసనీయ సమాచారం. పోలీసుల అదుపులో ఉన్నవారిలో ఇద్దరు వెంకట్‌ను హత్యచేయగా మరో ఇద్దరు అడ్డుకున్నట్లు తెలియవచ్చింది. హత్య జరిగిన సమయంలో ఆ బర్త్‌డే పార్టీలో మొత్తం ఏడుగురు ఉన్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం.


