ఉపాధి హామీ పథకాన్ని నీరుగార్చే బిల్లును వెనక్కి తీసుకోవ
ఏపీ కౌలు రైతు సంఘం ప్రధాన కార్యదర్శి హరిబాబు జీఓ కాపీలు దహనం
తాడేపల్లి రూరల్: గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని నీరుగార్చే విధంగా కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన బిల్లును వెంటనే వెనక్కి తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘం ప్రధాన కార్యదర్శి మాగంటి హరిబాబు డిమాండ్ చేశారు. తాడేపల్లి రూరల్ పరిధిలోని చిర్రావూరులో ఉపాధి హామీ పథకంపై కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన బిల్లును వ్యతిరేకిస్తూ రైతు, కౌలు రైతు సంఘాల నాయకులు బిల్లుల ప్రతులను శనివారం దహనం చేశారు. హరిబాబు మాట్లాడుతూ 2025లో అప్పటి యూపీఏ ప్రభుత్వానికి వామపక్ష పార్టీలు మద్దతునిచ్చి గ్రామీణ ప్రాంతాల్లో పేదలకు ఉపాధి కల్పించే విధంగా ఉపాధి హామీ చట్టాన్ని అమలు చేసేందుకు కృషి చేశారని పేర్కొన్నారు. కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పేదల కడుపుకొట్టే విధంగా ఉపాధి హామీ పథకం నిధులను పక్కదారి పట్టించడమేకాకుండా, బడ్జెట్‌లో ఉపాధి హామీ పథకానికి పూర్తిస్ధాయిలో నిధులు కేటాయించకుండా గ్రామీణ పేదలకు అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. కార్యక్రమంలో ఏపీ రైతు సంఘం గుంటూరు జిల్లా అధ్యక్షులు జొన్నా శివశంకరరావు, ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర నాయకులు జి.అప్పలస్వామి, రైతు సంఘం తాడేపల్లి మండల నాయకులు దొంతిరెడ్డి వెంకటరెడ్డి, బొప్పన గోపాలరావు, కౌలు రైతు సంఘం నాయకులు పల్లపాటి సుబ్బారావు, అడప సూరిబాబు తదితరులు పాల్గొన్నారు.
ఉండవల్లిలో...
ఎంటీఎంసీ పరిధిలోని ఉండవల్లి సుందరయ్య చౌక్ వద్ద మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి పథకం పేరును మార్పు చేయవద్దని నిరసన వ్యక్తం చేసి, జీవో కాపీలను దహనం చేశారు. కార్యక్రమంలో రైతు సంఘాల నాయకులు ఈశ్వర్‌రెడ్డి, వీరాస్వామి, కోటేశ్వరరావు, గాంధీ, రామారావు, వెంకటేశ్వరరావు, దొంతిరెడ్డి వెంకటరెడ్డి, సారధి తదితరులు పాల్గొన్నారు.


