ప్రాధాన్యతా క్రమంలో అర్జీల పరిష్కారం
సీఆర్డీయే కమిషనర్ కె కన్నబాబు
తాడికొండ: అర్జీలను ప్రాధాన్యతా క్రమంలో పరిష్కరిస్తామని సీఆర్‌డీఏ కమిషనర్ కె.కన్నబాబు, అడిషనల్ కమిషనర్ ఎ.భార్గవతేజ్‌లు అర్జీదారులకు హామీ ఇచ్చారు. రాజధాని అమరావతిలో రైతులు, రైతు కూలీల సమస్యల పరిష్కారం కోసం రాయపూడిలోని సీఆర్డీయే ప్రధాన కార్యాలయంలో శనివారం ‘గ్రీవెన్స్ డే‘ నిర్వహించారు. అర్జీలను కమిషనర్ కె కన్నబాబు, అడిషనల్ కమిషనర్ ఏ భార్గవతేజ్‌లు స్వీకరించారు. గ్రామకంఠాలు, ఎల్‌పీఎస్ లే అవుట్లు, రిటర్నబుల్ ప్లాట్ల రీ అలాట్‌మెంట్ తదితర సమస్యలపై పలువురు అర్జీలు అందజేశారు. అర్జీదారులు తెలియజేసిన పలు ఫిర్యాదులకు అధికారులు అక్కడికక్కడే పరిష్కారం చూపగా మిగిలినవి కూడా సత్వరమే పరిష్కరించాలని, అలసత్వం వద్దని కమిషనర్ అధికారులకు సూచించారు. ప్రతి శనివారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు రాయపూడిలోని సీఆర్డీయే ప్రధాన కార్యాలయంలో జరిగే గ్రీవెనన్స్ డేను రైతులు వినియోగించాలన్నారు.


