గడియారం క్లూతో హత్య కేసును ఛేదించిన పోలీసులు
పట్టు వదలని విక్రమార్కులు...
యడ్లపాడు: అది జూన్ 25వ తేదీ.. యడ్లపాడు హైవే పక్కన కాలువలో పూర్తిగా దగ్ధమైన యువకుడి మృతదేహం. ఎలాంటి ఆనవాళ్లు లేవు, ఆధారాలు అంతకంటే లేవు. ముఖం కూడా గుర్తు పట్టలేనంతగా పెట్రోల్ పోసి తగులబెట్టారు. నిందితులు తాము చేసిన నేరానికి ఎక్కడా చిన్న క్లూ కూడా దొరకదని భావించారు. ఇది పోలీసులకు సవాల్‌గా మారింది. నేరం చేసే సమయంలో ఎంత తెలివిగా వ్యవహరించినా ఎక్కడో ఓ చోట లభించే చిన్న క్లూతో ఇట్టే దొరికిపోతారు. అలాంటి ఘటనే ఇది. ఘటనా స్థలంలో మిగిలిన ఒక చిన్న ’క్యాషియో వాచ్ ప్లేట్’. అదే పోలీసుల పాలిట బ్రహ్మాస్త్రమైంది. ముగ్గురు కిరాతకులను జైలు ఊచల వెనక్కి పంపడమే కాకుండా, పోలీసులకు ప్రతిష్టాత్మక అవార్డును తెచ్చిపెట్టింది.
ఏమిటీ కథ?
గుంటూరు జిల్లా పెదకాకానికి చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ తాడిబోయిన గోపి(32) వెబ్ సిరీస్‌ల నిర్మాణంలో బిజీగా ఉండేవారు. ఈ క్రమంలో పరిచమైన గుంటూరుకు చెందిన షేక్ ఇమ్రాన్ అనే వ్యక్తితో మనస్పర్థలు ఏర్పడ్డాయి. ఈ క్రమంలోనే కిరాతక పథకం పన్నిన ఇమ్రాన్ తన అనుచరులు షేక్ రియాజ్, ఖాజామొహిద్దీన్‌లతో కలిసి ఈ ఏడాది జూన్ 24న గోపిని ఇమ్రాన్ అద్దె ఇంటికి పిలిపించి రాడ్‌తో తలపై కొట్టి, ఆపై తాడుతో ఊరివేసి హత్య చేశారు. గోపీకారు డిక్కీలోనే మృతదేహాన్ని పెట్టి యడ్లపాడుకు తరలించారు. 16వ హైవే సర్వీస్ మార్గంలోని డ్రైనేజ్‌లో 25న పట్టపగలే తగులబెట్టి పరారయ్యారు.
డీజీపీ ప్రశంసలు–అవార్డుల పంట..
పోలీసుల ఈ అసాధారణ ప్రతిభను గుర్తించిన రాష్ట్ర డీజీపీ హరీష్‌కుమార్ గుప్తా శుక్రవారం తన కార్యాలయంలో ప్రత్యేకంగా అభినందించారు. అవార్డు ఫర్ బెస్ట్ క్రైమ్ డిటెక్షన్ (ఏబీసీడీ) అందజేశారు. పల్నాడు ఎస్పీ కృష్ణారావుతోపాటు అద్భుతమైన నైపుణ్యం కనబరిచిన డీఎస్పీ హనుమంతరావు, సీఐ సుబ్బానాయుడు, ఎస్సై శివరామకృష్ణ, ఏఎస్‌ఐలు సుబ్బారావు, రోశిబాబు, హెడ్ కానిస్టేబుల్ శ్రీధర్, కానిస్టేబుల్ ఇర్మియా, హోంగార్డులు మధు, సాంబశివరావులను డీజీపీ ప్రశంసించారు. క్లూస్ టీం సీడీఆర్ వింగ్ సమన్వయం ఈ విజయంలో కీలకమైందని కొనియాడారు.
ముగ్గురు నిందితులకు జైలు
పోలీసులకు ఏబీసీడీ అవార్డు, ప్రశంస
డీజీపీ చేతుల మీదుగా అందుకున్న పల్నాడు జిల్లా ఎస్పీ కృష్ణారావు, దర్యాప్తు బృందం
ఆ సమయంలో అటుగా వస్తున్న పోలీసులు మంటల్ని గమనించి ఆర్పేసినా అప్పటికే దేహం పూర్తిగా కాలిపోయింది. క్రైమ్ నం:68/2025 మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించిన పోలీసులకు మొదట అంతా శూన్యం అనిపించింది. ఉమ్మడి గుంటూరు జిల్లాలో జల్లెడ పట్టినా మృతుడెవరో తెలియలేదు. ఏ స్టేషన్‌లో అదృశ్యమైనట్టు ఫిర్యాదు లేదు. కానీ చిలకలూరిపేట రూరల్ సీఐ బి సుబ్బానాయుడు, యడ్లపాడు ఎస్సై టి శివరామకృష్ణ జిల్లా ఎస్పీ ఆదేశాలతో కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకుని విచారణ ముమ్మరం చేశారు. సంఘటనా స్థలంలో లభించిన కాలిపోయిన కాసియో వాచ్ అడుగు భాగంలోని ప్లేట్‌పై ఉన్న నంబర్ ఆధారంగా మృతుడు గోపి అని గుర్తించారు. సెప్టెంబర్ 23 నాటికి ఈ కేసులో నిందితులందరినీ అరెస్ట్ చేసి పోలీసు శాఖ సత్తా చాటారు.


