ఆస్ట్రేలియా వెళ్తాడనుకుంటే..కానరాని లోకాలకెళ్లాడు!
నాదెండ్ల: విదేశాలకు వెళ్లి ఉన్నత చదువులు పూర్తి చేసి కుటుంబానికి అండగా నిలుస్తాడనుకున్న తల్లిదండ్రుల ఆశలు ఆవిరయ్యాయి. ఫిరంగిపురం మండలం మేరిగపూడి గ్రామానికి చెందిన పాకనాటి శ్రీసత్యసాయి మణికంఠారెడ్డి (21) బీటెక్ పూర్తి చేసి ఉన్నత చదువుల కోసం ఆస్ట్రేలియా వెళ్లేందుకు వీసాకు సంబంధించిన ప్రక్రియను పూర్తి చేసేందుకు బుల్లెట్ బైక్‌పై వెళ్తూ ప్రమాదానికి గురై మృత్యువాత పడిన సంఘటన నాదెండ్ల గ్రామ పరిధిలో శుక్రవారం చోటుచేసుకుంది. ఎస్సై ఆర్.వెంకటేశ్వరరావు తెలిపిన వివరాల మేరకు మేరిగపూడి గ్రామానికి చెందిన పాకనాటి యలమందారెడ్డి, విజయలక్ష్మి దంపతులు వ్యవసాయ పనులు చేసుకుని జీవిస్తుంటారు. వీరికి ఇరువురు కుమారులు. పెద్దకుమారుడు మణికంఠారెడ్డి బీటెక్ పూర్తి చేశాడు. రెండో కుమారుడు మనోహర్‌రెడ్డి గ్రామంలోనే తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. మణికంఠారెడ్డి ఆస్ట్రేలియాలో ఉన్నత చదువులు చదివేందుకు దరఖాస్తు చేసుకున్నాడు. శుక్రవారం ఉదయం మేరిగపూడి నుంచి చిలకలూరిపేటకు బుల్లెట్ వాహనంపై బయలుదేరాడు. నాదెండ్ల –తిమ్మాపురం మార్గంమధ్యలో ఉబ్బలవాగు సమీపానికి వచ్చేసరికి ఎదురుగా వస్తున్న కంకర లోడు ట్రాక్టర్ ఢీకొంది. దీంతో మణికంఠారెడ్డి సంఘటనా స్థలంలోనే మృతి చెందాడు. సమాచారం తెలుసుకున్న ఎస్సై సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని చిలకలూరిపేట ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. పెద్ద కుమారుడు మృతితో తల్లిదండ్రులు తల్లడిల్లారు. తల్లి విజయలక్ష్మి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
బిడ్డ మరణంతో మేరిగపూడిలో
ఘొల్లుమన్న తల్లిదండ్రులు
వీసా ప్రక్రియ కోసం వెడుతూ
బీటెక్ విద్యార్థి దుర్మరణం


