మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను రద్దు చేయాలి
గళమెత్తిన విద్యార్థి సంఘాల నాయకులు, సీపీఐ నాయకులు జిల్లాలోని మెడికల్ కళాశాల వద్ద నిరసన ర్యాలీ
పిడుగురాళ్ల రూరల్/ పిడుగురాళ్ల: డబుల్ ఇంజన్ సర్కార్ ప్రైవేట్ వ్యక్తులకు మాత్రమేనని, పేదవాడి కడుపు కొట్టి ప్రైవేటు వ్యక్తుల కడుపు నింపటం సరైన పద్ధతి కాదంటూ సీపీఐ, విద్యా సంఘాల నాయకులు గళమెత్తారు. పల్నాడు జిల్లా కామేపల్లి గ్రామంలోని మెడికల్ కాలేజీని ఏఐఎస్‌ఎఫ్, సీపీఐ, ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో గురువారం సందర్శించారు. డౌన్ డౌన్ చంద్రబాబు ప్రభుత్వం, పీపీపీ విధానంమాకొద్దు... అంటూ నినాదాలతో మెడికల్ కాలేజీ ప్రాంగణం హోరెత్తించారు. అనంతరం ర్యాలీగా మెడికల్ కాలేజకి వెళ్లి భవనాలను సందర్శించారు. తొలుత మెడికల్ కాలేజీని సందర్శించేందుకు సీపీఐ నాయకులు, విద్యార్థి సంఘాల నాయకులు అద్దంకి నార్కెట్‌పల్లి హైవే వద్దకు చేరుకొని మెడికల్ కాలేజీలోకి వెళ్లేందుకు చూస్తుండగా పోలీసులు రంగ ప్రవేశం చేశారు. కాలేజీని సందర్శించేందుకు ఎలాంటి అనుమతి లేదని ర్యాలీని అడ్డుకున్నారు. మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయటం వల్ల పిల్లలు, భవిష్యత్ పోతుందని, అడ్డుకోవటం సరైనది కాదని, చంద్రబాబు ప్రభుత్వం కోసం పోలీసులు పని చేస్తున్నారని చెప్పటంతో నాయకులకు, పోలీసులకు వాగ్వాదం జరిగింది. అనంతరంమెడికల్ కాలేజీని సీపీఐ నాయకులు, విద్యార్థి సంఘాల నాయకులు సందర్శించారు. మెడికల్ కాలేజీని వెంటనే ప్రభుత్వమే పూర్తి చేస్తే వెనుక బడిన పల్నాడు ప్రాంత ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుందని, వెంటనే దీనిని పూర్తి చేయాలని కోరారు. కార్యక్రమంలో ఏఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి బందె నాసర్‌జి, సీపీఐ జిల్లా కార్యదర్శి ఎ.మారుతి వరప్రసాద్, సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శులు షేక్ హుస్సేన్, కాసా రాంబాబు, ఏఐఎస్‌ఎఫ్ జిల్లా అధ్యక్షులు ఎం.సుబ్బారావు, ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు సర్వయ్య, గురజాల నియోజకవర్గ కార్యదర్శి మందపాటి రమణారెడ్డి, సీపీఐ సెక్రటరీ అక్కినపల్లి బాలయ్య, గోదా శ్రీను, బాబురావు, విద్యార్థి సంఘాల నాయకులు చక్రవర్తి, శ్రీరాం, బుర్రి కృష్ణారెడ్డి, సత్యనారాయణ, ఏఎస్‌ఎఫ్‌ఐ నాయకులు మధు, నాగేంద్రరావు, తదితరులు పాల్గొన్నారు. ర్యాలీని ఉద్దేశించి ఏఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బందె నాసర్‌జీ మాట్లాడుతూ చంద్రబాబు కథలు నమ్మేందుకు పేద ప్రజలు సిద్ధంగా లేరన్నారు. సీపీఐ జిల్లా కార్యదర్శి మారుతీ వరప్రసాద్ మాట్లాడుతూ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేస్తే పేద విద్యార్థి పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. సీపీఐ పల్నాడు జిల్లా సహాయ కార్యదర్శి హుస్సేన్ మాట్లాడుతూ పేదవాడికి వైద్య విద్య, వైద్యం అందేలా చూడాలని కోరారు. పల్నాడు ప్రాంతానికి మెడికల్ కాలేజీ మణిహారం లాంటిదన్నారు.
మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను రద్దు చేయాలి


