ముగిసిన ‘అన్వేషణ్ – 2025’
తాడికొండ: భారత విశ్వవిద్యాలయాల సంఘం (ఏఐయూ) నిర్వహించిన విద్యార్థుల పరిశోధన – ఆవిష్కరణ పోటీ (సౌత్ జోన్) అన్వేషణ్–2025, గురువారం వీఐటీ–ఏపీ విశ్వవిద్యాలయంలో విజయవంతంగా ముగిసింది. 17,18 తేదీలలో నిర్వహించిన ఈ కార్యక్రమం భారతదేశంలోనే అతిపెద్ద పరిశోధన మరియు ఆవిష్కరణ పోటీగా కళాశాల యాజమాన్యం తెలిపారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంగళగిరి ఎయిమ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ అహంతెం శాంతా సింగ్ హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ దేశ నిర్మాణంలో యువత నేతృత్వంలోని పరిశోధనలు కీలక పాత్ర పోషిస్తాయన్నారు. గౌరవ అతిథి జీనియస్ ఫిల్టర్స్ అండ్ సిస్టమ్స్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ పంచుమర్తి లక్ష్మీ భీమేష్ మాట్లాడుతూ విద్యార్థులు తమ పరిశోధనా కార్యకలాపాలను వాస్తవ ప్రపంచ పారిశ్రామిక సామాజిక సవాళ్లతో అనుసంధానించాలన్నారు. అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీస్ (ఏఐయూ) జాయింట్ డైరెక్టర్ డాక్టర్ అమరేంద్ర పాణి ప్రత్యేక అతిథిగా హాజరై పాల్గొన్న వారితో పాటు అవార్డు గ్రహీతలను అభినందించారు. అత్యుత్తమ విద్యార్థి పరిశోధన ప్రాజెక్టులను పోస్టర్ ప్రజెంటేషన్ పోడియం ప్రజెంటేషన్ రెండింటి నుంచి ఎంపిక చేశారు. ప్రతి ట్రాక్ నుంచి మొదటి, రెండవ మరియు మూడవ స్థానాల్లో నిలిచిన విజేతలను సత్కరించారు. వీఐటీ–ఏపీ విశ్వవిద్యాలయ వైస్ చాన్స్‌లర్ డాక్టర్ పి.అరుల్మోళి వర్మన్, రిజిస్ట్రార్ డాక్టర్ జగదీష్ చంద్ర ముదిగంటి హాజరయ్యారు.


