వైఎస్సార్ సీపీ బూత్ కన్వీనర్‌పై టీడీపీ కార్యకర్త దాడి
పిడుగురాళ్ల: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బూత్ కన్వీనర్ షేక్ సుభానిపై టీడీపీ కార్యకర్త కరాలపాడు ముజావర్ రహీం మద్యం సీసాతో దాడి చేసిన సంఘటన పిడుగురాళ్ల పట్టణంలోని లెనీన్‌నగర్‌లో గురువారం రాత్రి జరిగింది. బాధితుడు సుభాని తెలిపిన వివరాలు.. 32వ వార్డులోని 294 బూత్ వైఎస్సార్ సీపీ కన్వీనర్‌గా షేక్ సుభాని పనిచేస్తున్నారు. ఆయన లెనిన్‌నగర్‌లోని తన ఇంటి సమీపంలో ఉన్న వారితో మాట్లాడుతున్నాడు. అప్పటికే మద్యం తాగిన కరాలపాడు ముజావర్ రహీం సుభాని వద్దకు వచ్చి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వాళ్లు ఏం చేస్తారు రా.. మీరేమీ చేయలేరూరా... మా టీడీపీకి అధికారం ఉంది మేము ఏమైనా చేస్తాం అంటూ విరుచుకుపడ్డాడు. రహీం మద్యం తాగి ఉన్నావ్ ఇంటికి వెళ్లు రేపు మాట్లాడుకుందామని సుభానీ చెప్పడంతో నువ్వు ఏందిరా నాకు చెప్పేది అంటూ నా ఇష్టం మీ వైఎస్సార్ సీపీ వాళ్లు ఏమీ చేయలేరంటూ నోటికి వచ్చినట్లు అసభ్యకరంగా మాట్లాడడంతోపాటు అతను దగ్గర ఉన్న మద్యం ఖాళీ సీసా పగలగొట్టి సుభానీపై దాడి చేశాడు. సుభాని వెంటనే చెయ్యి అడ్డు పెట్టాడు. అతని చేతికి తీవ్ర గాయమైంది. ఎడమ చెంపకు గాయమైంది. స్థానికులు కరాలపాడు ముజావర్ రహీంను పట్టుకునేందుకు ప్రయత్నించడంతో అక్కడి నుంచి పారిపోయాడు. పట్టణ పోలీస్‌స్టేషన్లో ఫిర్యాదు చేసేందుకు సుభానీ వెళ్లాడు. రక్తస్రావం అవుతుండడంతో పోలీసులు వెంటనే గురజాల ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లమని సూచించగా గురజాల ప్రభుత్వ ఆసుపత్రికి వెళుతున్నానని తెలిపారు.


