గాంధేయ వాది ఆళ్ల సుబ్బారెడ్డి మృతి
నివాళులర్పించిన పలువురు ప్రముఖులు
నరసరావుపేట: గాంధేయ హేతువాది, సాంఘిక ఉద్యమాల నేత, విశ్రాంత తెలుగు ఉపాధ్యాయులు ఆళ్ల సుబ్బారెడ్డి (96) బుధవారం హైదరాబాదులో మృతిచెందారు. గురువారం నరసరావుపేటలో కుటుంబ సభ్యులు ఆయన పార్థివదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు. ప్రకాశం జిల్లాలోని పలు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలలో తెలుగు ఉపాధ్యాయులుగా పనిచేసి, నరసరావుపేట కేంద్రంగా గాంధీ స్మారక సమితి, అశ్లీలత ప్రతిఘటన వేదిక, మద్య వ్యతిరేక పోరాట సమితి, లోక్‌సత్తా ఉద్యమ సంస్థ, లోక్‌సత్తా పార్టీ జన విజ్ఞాన వేదికలలో చురుకై న నాయకత్వ బాధ్యతలు నిర్వహించారు. పలువురు పట్టణ ప్రముఖులు, బంధుమిత్రులు సుబ్బారెడ్డి భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి సంతాపం తెలిపారు. మాకినేని హరిబాబు, ఈదర గోపీచంద్, సర్వేశ్వరరావు, ఈవూరి వెంకటరెడ్డి, బీఆర్ సుబ్బారావు, జెవీవీ నరసింహారెడ్డి మాట్లాడుతూ ప్రకృతి జీవన విధానం, పట్టణ పారిశుద్ధ్యంతో సహా పలు ఆదర్శాలను అమలు పరచిన సుబ్బారెడ్డి అందరికీ ఆదర్శప్రాయులని, చిరస్మరణీయులని కొనియాడారు. సుబ్బారెడ్డి పెద్ద కుమారుడు రవీంద్రారెడ్డి తెనాలిలో విశ్రాంత అధ్యాపకులుగా, చిన్న కుమారుడు కరుణాకర్ గృహ నిర్మాణం రంగంలోను, కుమార్తె సుమతి, అల్లుడు రమేష్‌రెడ్డి విశ్రాంత డీఎస్పీగా హైదరాబాదులో ఉన్నారు.


