కొనసాగిన ఐటీహెచ్‌పీబీఏబీ గ్లోబల్ కాన్ఫరెన్స్
గుంటూరు రూరల్: నగర శివారుల్లోని లాం గ్రామంలోని చలపతి ఫార్మశీ కళాశాలలో జరుగుతున్న గ్లోబల్స్ కాన్ఫరెన్స్ రెండవ రోజు బుధవారం కొనసాగింది. రెండవ రోజు కార్యక్రమాల్లో భాగంగా అవార్డు ఉపన్యాసాలు, పరిశోధనలపై సదస్సు నిర్వహించారు. ఇంటిగ్రేటింగ్ టెక్నాలజీ విత్ హెల్త్‌కేర్ ఫార్మాస్యూటికల్స్, బయోటెక్నాలజీ, అగ్రికల్చర్, బయోమెడికల్ సైన్సెస్ ఫర్ సస్టైనబుల్ డెవలప్‌మెంట్ (ఐటీహెచ్‌బీఏబీ–2025) గ్లోబల్ కాన్ఫరెన్స్‌లో జపాన్ దేశానికి చెందిన ప్రముఖ న్యూరాలజిస్టు ప్రొఫెసర్ మసాకో కినోషితా న్యూరాలజీ రంగంలో విశేషమైన పరిశోధనా, వైద్య అనుభవాన్ని వివరించారు. ఫార్మసీ రంగంలో జీవితకాల సేవలకు ప్రొఫెసర్ జి.నరహరిశాస్త్రికి, బయోటెక్నాలజీ రంగంలో జీవితకాల కృషికి డాక్టర్ శ్రీనివాసులుకు లైఫ్ టైం అచీవ్‌మెంట్ అవార్డులు ప్రదానం చేశారు. పరిశ్రమలలో బయోటెక్నాలజీ అభివృద్ధికి కృషిచేసిన డాక్టర్ కె.సురేష్‌బాబుకు టాలెంటెడ్ ఇండస్ట్రియల్ బయోటెక్నాలజిస్ట్ అవార్డు అందించారు. ఏబీఏపీ సీనియర్ సైంటిస్ట్ అవార్డులు డాక్టర్ బిపిన్‌నాయర్, డాక్టర్ వెంకటదాసు వీరంకి, డాక్టర్ లతారంగన్‌లకు అందించి సత్కరించారు. యువ పరిశోధకుల ప్రతిభను గుర్తిస్తూ ఏబీఏపీ టాలెంటెడ్ ఇన్నోవేటివ్ సైంటిస్ట్ అవార్డులు డాక్టర్ శ్రీకాంత్‌గడాడ్, డాక్టర్ బృందా గన్నేరు, డాక్టర్ శ్రీనివాస్ పెంట్యాలాలకు అవార్డులు అందజేశారు. నానో సైన్స్, టెక్నాలజీ రంగంలో ఉన్నత పరిశోధనలకు డాక్టర్ శ్రీనివాసరెడ్డి బోనం, ఏబీఏపీ గోల్డ్ మెడల్‌ను, పరిశ్రమలలో వినూత్న ఆవిష్కరణలకు డాక్టర్ జి.వివేకానందన్‌కు ఏబీఏపీ ఇండస్ట్రీ ఇన్నోవేటివ్ అవార్డు ప్రదానం చేశారు. మొత్తం 161 ఒరల్ ప్రెజెంటేషన్లు 104 పోస్టర్ ప్రెజెంటేషన్లు జరిగాయి. చలపతి ఫార్మసీ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ డాక్టర్ రామారావు నాదెండ్ల, అసిస్టెంట్ ప్రొఫెసర్ డి నళినిదేవిలు రచించిన ఎమ్‌సీక్యూస్ ఇన్ పార్మాస్యూటికల్ కెమిస్ట్రీ అనే పుస్తకాన్ని జపాన్‌కు చెందిన ప్రముఖ న్యూరాలజిస్టు ప్రొఫెసర్ మసాకో కినోషితా ఆవిష్కరించారు. కార్యక్రమంలో శాస్త్రవేత్తలు, అధికారులు ఇతర దేశాలకు చెందిన ప్రొఫెసర్లు, విద్యార్థులు, అధ్యాపకులు పాల్గొన్నారు.


