సాగర్‌లో ఆక్టోపస్ మాక్ డ్రిల్
విజయపురిసౌత్: నాగార్జునసాగర్ ప్రాజెక్టు పరిధిలో సోమవారం ఆక్టోపస్ దళాలు మాక్ డ్రిల్ నిర్వహించాయి. ఇటీవల కాలంలో దేశంలోని ప్రముఖ ప్రదేశాలలో ఉగ్రవాద మూకల కదలికల దృష్ట్యా ఆక్టోపస్ దళాలు మాక్ డ్రిల్ నిర్వహిస్తున్నాయి. దీనిలో భాగంగా ఆక్టోపస్ దళాల డీఎస్పీ స్థాయి అధికారి ఆధ్వర్యంలో సాగర్‌లోని ప్రధాన జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రం పరిసర ప్రాంతాలు, పవర్ హౌస్ లోపలి భాగంలో ఉగ్రవాదులు చొరబడితే అక్కడ భద్రతా విధులు నిర్వహిస్తున్న స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏవిధంగా స్పందించాలి, ఆక్టోపస్ బలగాలకు సమాచారం అందిన వెంటనే బలగాలు ఏవిధంగా ఎదుర్కోవాలి, ఎటువంటి ప్రత్యేక కోడ్‌లతో ఆపరేషన్ నిర్వహించాలనే అనే విషయంలో సంఘటన జరుగుతున్నట్లుగా మాక్ డ్రిల్ నిర్వహించారు. ఈ విధంగానే నాగార్జునసాగర్ ప్రధాన డ్యామ్ పరిసర ప్రాంతాలలో ఉగ్రవాదుల సంచారం, ఉగ్రవాదులు డ్యామ్‌పైకి ప్రవేశించే సందర్భాలలో, సాగర్ డ్యాం పరిధిలోని సున్నితమైన విభాగాలలో ఉగ్రదాడిని ఎదుర్కొనే సంఘటనలను ఆక్టోపస్ దళాలు డ్రిల్ నిర్వహించాయి. ఉగ్రవాదులను ఎదుర్కొనే సందర్భంలో గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించడానికి అంబులెన్సులు, మంటలు చెలరేగితే ఆపటానికి అగ్నిమాపక వాహనాలు నిజంగానే ఉగ్రవాదులను ఆక్టోపస్ దళాలు ఎదుర్కొంటున్నట్టుగా వ్యవహరించారు. మాక్ డ్రిల్ లో ఎస్‌పీఎఫ్ ఉన్నత అధికారులు, తెలంగాణ పోలీస్ అధికారులు, సీఆర్‌పీఎఫ్ దళాలు, ఎస్‌పీఎఫ్ దళాలు పాల్గొన్నాయి.


