వైఎస్సార్ సీపీ వర్గీయులపై టీడీపీ నాయకుల దాడి
మంచికల్లు(రెంటచింతల): మంచికల్లు గ్రామంలో సోమవారం సాయంత్రం వైఎస్సార్ సీపీ వర్గీయులపై టీడీపీ వర్గీయులు కర్రలతో దాడికి పాల్పడ్డారు. గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. పొలం వెళ్లి ఇంటికి వస్తున్న వైఎస్సార్ సీపీ నాయకులు పొట్లపాటి శ్రీనివాసరెడ్డితోపాటు తన ఇంటి ముందున్న వెన్నా శ్రీనివాసరెడ్డిని ఆయన తమ్ముడు కొడుకు వెంకటరెడ్డిపై టీడీపీకి చెందిన వారు ఒక్కసారిగా కర్రలతో దాడిచేశారు. దాడిలో వెంకటరెడ్డి రెండు చేతులకు తీవ్రగాయాలు కాగా వెంటనే నరసరావుపేటలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. పొట్లపాటి శ్రీనివాసరెడ్డికి, వెన్నా శ్రీనివాసరెడ్డిలకు స్పల్ప గాయాలయ్యాయి. ఘర్షణ జరిగిన విషయం తెలుకున్న వెన్నా శ్రీకాంత్‌రెడ్డి భార్య ఇప్పుడు గొడవలు ఎందుకు పడుతున్నారని వీధిలో అన్నందుకు కొందరు టీడీపీ వారు ఆమె ఇంటిపైకి వెళ్లి ఇష్టం వచ్చినట్లు దుర్భాషలాడారు. 2024 సార్వత్రిక ఎన్నికల అనంతరం గ్రామంలోని వైఎస్సార్ సీపీకి చెందిన సుమారు 35 కుటుంబాలు గ్రామం విడిచి వివిధ ప్రాంతాలలో తల దాచుకుంటున్నారు. ఈ నేపథ్యంలో గురజాల డీఎస్సీ జగదీష్ ఆదేశాల మేరకు ఎస్‌ఐ సీహెచ్ నాగార్జున ఈ నెల 11వ తేదీన వైఎస్సార్ సీపీకి చెందిన 27 మందిని తహసీల్దార్ మేరి కనకం ఎదుట బైండోవర్ చేసి గ్రామంలో గొడవలు పడకుండా ప్రశాంతంగా ఉండాలని గ్రామంలోకి వెళ్లమని చెప్పడంతో వారు గ్రామంలోకి వచ్చారు. గ్రామంలో పోలీస్ పికెట్ ఏర్పాటు చేసి గ్రామంలో ప్రశాంత వాతావరణం నెలకొనడానికి పోలీసులు చర్యలు చేపట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు.


