వర్షాలపై అప్రమత్తంగా ఉండండి
జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా జిల్లా అధికారులతో సమీక్ష కంట్రోల్ రూమ్ (08647–2529999) ఏర్పాటు
నరసరావుపేట: ఈనెల 27 నుంచి 29 వరకు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించిన నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని, ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. వచ్చే నాలుగురోజులు విస్తృతంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అన్నీశాఖలు సమన్వయంతో లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు. జల వనరులు, రెవెన్యూ, పోలీసు, రవాణా, మృత్య్సశాఖ, పంచాయతీరాజ్, రహదారులు, భవనాలు, వ్యవసాయ శాఖల అధికారులు వరద పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేసుకొని ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలన్నారు. జిల్లా స్థాయిలో కంట్రోల్‌రూమ్ 08647–2529999 ఏర్పాటుచేసినట్లు తెలిపారు. జనరేటర్లు, తాగునీరు అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. గ్రామాల్లో దండోరా వేసి ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు. నిత్యావసర వస్తువుల పంపిణీపై ముందస్తు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.
కౌశలం సర్వే పూర్తి చేయండి: కలెక్టర్
నరసరావుపేట: వచ్చే సోమవారంలోగా జిల్లాలో కౌశలం సర్వే పూర్తిచేయాలని కలెక్టర్ కృతిక శుక్లా అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో శనివారం వర్క్ ఫ్రమ్ హోం సర్వే, పీఎం అవాస్ యోజన, స్వచ్ఛ ఆంధ్ర– స్వర్ణాంధ్ర, సిటిజెన్ ఈకేవైసీ అంశాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం వర్క్ ఫ్రమ్ హోం ద్వారా నిరుద్యోగులకు ఇంటి వద్దే ఉపాధి కల్పించే అవకాశాలను పరిశీలిస్తోందని, ఆశావహుల సర్వే, ఈకేవైసీ వెంటనే పూర్తిచేయాలని తెలిపారు. గోకులం షెడ్ల నిర్మాణాలు డిసెంబరు 15 నాటికి పూర్తిచేయాలని డ్వామా పీడీ సిద్దలింగమూర్తిని ఆదేశించారు. ఉపాధి కూలీల జాబ్ కార్డుల పునరుద్ధరణ (ఈకేవైసీ) మూడు రోజుల్లో పూర్తిచేయాలని చెప్పారు. స్వచ్ఛ ఆంధ్ర–స్వర్ణ ఆంధ్ర ద్వారా ఇంకుడు గుంతల నిర్మాణాలు, సుందరీకరణ పనులు లక్ష్యం మేరకు చేయాలని తెలిపారు. ప్రధానమంత్రి ఆవాస యోజన ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలని చెప్పారు. సమావేశంలో డీపీఓ నాగేశ్వర్ నాయక్, డీఎల్డీవోలు పాల్గొన్నారు.


