భక్తిశ్రద్ధలతో నాగులచవితి పూజలు
అమరావతి: బాలచాముండికా సమేత అమరేశ్వరస్వామి ఆలయంలో శనివారం నాగులచవితిని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. నాగేంద్రుని పుట్ట వద్ద భక్తులు పాలుపోసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేకువజామున భక్తులు పవిత్ర కృష్ణానదిలో కార్తిక స్నానాలు చేసి, ఆలయంలోని ఉసిరిక చెట్టు వద్ద దీపాలను వెలిగించారు. అనంతరం అమరేశ్వరునికి అభిషేకాలు, బాలచాముండేశ్వరీ అమ్మవారికి కుంకుమ పూజలు నిర్వహించారు. ఆలయంలోని మొదటి ప్రాకారంలో జ్వాలాముఖి అమ్మవారి ఆలయం వద్ద, తూర్పు గాలిగోపురం దగ్గరున్న నాగేంద్రుని పుట్టలలో పాలు పోసి పూజలు చేశారు. నాగేంద్రునికి ఇష్టమైన నువ్వుల పిండి, సజ్జనానుబాలు, ఆవు పాలు, అరటి పండ్లు, చలిమిడిని పుట్టలో వేసి దీపారాధనలు చేశారు. పుట్టమట్టిని పిల్లల చెవులకు పెట్టి నాగేంద్రుని స్తోత్రాలను పఠించారు. దీనివల్ల చెవి సంబంధిత వ్యాధులు తగ్గిపోతాయని భక్తుల విశ్వాసం. ఈ సందర్భంగా ఆలయస్థానాచార్యుడు కౌశిక చంద్రశేఖరశర్మ నాగులచవితి విశిష్టతను వివరించారు.


