గందరగోళంగా ఏఎన్‌యూ పాలన వ్యవహారాలు మళ్లీ తాత్కాలిక ఉప కులపతి నియామకం
ఎన్నో ఆరోపణలు
సాక్షి ప్రతినిధి, గుంటూరు: రాష్ట్ర రాజధానిలోని ఏఎన్‌యూ పాలన వ్యవహారంలో ఉన్నత విద్యాశాఖ తీరు గందరగోళం సృష్టిస్తోంది. అక్టోబరు 8న ఇన్‌చార్జి ఉపకులపతి ఆచార్య గంగాధర్ వెంటనే రిలీవ్ కావాలంటూ జీవో 91 విడుదల చేసింది. ఈ నెల 24న నూతన వీసీ బాధ్యతలు స్వీకరించే వరకూ ఆయనే కొనసాగుతారని ఉత్తర్వులు జారీ చేయడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. దాదాపు 16 రోజుల క్రితం ఒక్క క్షణం కూడా పదవిలో ఉండకూడదనుకున్న మనిషి ఇప్పుడు ఒక్కసారిగా ఇష్టుడుగా ఎలా మారిపోయారన్న చర్చ మొదలైంది.
పేరు కూడా లేకుండా ఉత్తర్వులు
నూతన వీసీ బాధ్యతల స్వీకరణలో జాప్యం జరిగింది. మరో రెండు వారాలు సాంకేతిక కారణాలతో ఆయన రాలేని పరిస్థితి ఉండటంతో తిరిగి గంగాధర్‌కు ఈనెల 24న మళ్లీ ఇన్‌చార్జి వీసీ అంటూ ఉత్తర్వులు జారీ చేశారు. నాడు తొలగించిన విద్యాశాఖ అధికారులు నేడు కనీసం ఆయన పేరు కూడా ప్రస్తావించకుండా తాత్కాలిక వీసీని కొనసాగించాలంటూ ఉత్తర్వులు ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. ఈ ఉత్తర్వుల్లో కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించవద్దని, నూతన నియామకాలు చేపట్టవద్దని ప్రత్యేకంగా పేర్కొన్నారు. ఆర్థికపరమైన పాలసీలపై నిర్ణయాలు తీసుకోవద్దన్నారు. దీంతో ఉన్నత విద్యాశాఖకు ఏఎన్‌యూ పాలనలో జరిగిన తప్పిదాలపై పూర్తిస్థాయి అవగాహన ఉన్నట్టు వర్సిటీలో ప్రచారం జరుగుతోంది. కొందరు వివాదాస్పద అధికారులు తమ అక్రమాలతో ఇన్‌చార్జి వీసీని పక్కదారి పట్టించారంటూ సమాచారం ప్రభుత్వానికి చేరింది. మంత్రి లోకేష్ పేషీ ఆదేశించినా వారిపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఉన్నత విద్యాశాఖలోని ఒక కీలక అధికారి ఆదేశించినా పట్టించుకోలేదు. పూర్తి స్థాయి వీసీ బాధ్యతలు స్వీకరించడానికి 15 నుంచి 20 రోజులు పట్టే అవకాశం ఉంది.
దాదాపు 14 నెలలు తాత్కాలిక వీసీగా వ్యవహరించిన గంగాధర్ హయాంలో అడ్డగోలు నియామకాలు జరిగాయనే ఆరోపణలు వచ్చాయి. అనుయాయులకు ఇష్టారాజ ్యంగా జీతాలు పెంచారని, పరీక్ష పత్రాల లీకేజీ వ్యవహారంలో వర్సిటీ అప్రతిష్ట మూటగట్టుకోవడం వంటివి విమర్శలకు తావిచ్చాయి. వివాదాస్పద అధికారుల కనుసన్నల్లో పాలనతో ఏఎన్‌యూను అప్రతిష్టపాలు చేశారు. దీనిపై ‘సాక్షి’ పలు కథనాలు ప్రచురించింది. దీంతో ఏఎన్‌యూకి నూతన వీసీగా అక్టోబరు 8న సత్యనారాయణ రాజును నియమించారు. అదేరోజున తాత్కాలిక వీసీ గంగాధర్‌ను వెంటనే రిలీవ్ కావాలని ఉత్తర్వులు జారీ చేశారు. కొత్త వీసీని నియమించినా విధుల్లో చేరే వరకు పాతవారు తాత్కాలికంగా ఆ బాధ్యతల్లో కొనసాగడం ఆనవాయితీ. అయితే కొత్త వీసీని నియమించిన వెంటనే తాత్కాలిక వీసీగా ఉన్న గంగాధర్‌ను వెంటనే రిలీవ్ కావాలంటూ ప్రత్యేకంగా జీవో కూడా ఇచ్చారు.


