ఆకట్టుకున్న పోలీసు ఓపెన్ హౌస్
జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు ప్రారంభించిన జిల్లా ఎస్పీ బి.కృష్ణారావు ప్రదర్శనలో తుపాకులు, సాంకేతిక పరికరాలు ఆసక్తిగా తిలకించిన విద్యార్థులు
నరసరావుపేట రూరల్: పోలీసుల విధులు, ఆయుధాలపై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు జిల్లా ఎస్పీ బి.కృష్ణారావు తెలిపారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా జిల్లా పోలీసు కార్యాలయంలో ఆవరణలో శనివారం ఓపెన్ హౌస్ నిర్వహించారు. జిల్లా ఎస్పీ బి.కృష్ణారావు ప్రారంభించారు. విదార్థులు ఆసక్తిగా తిలకించారు. శాంతిభద్రతలను కాపాడేందుకు, నేరాల నియంత్రణకు వినియోగించే ఆయుధాలు, సాంకేతిక పరికరాలు, నేర దర్యాప్తులో తీసుకునే చర్యలు గురించి పోలీసులు విద్యార్థులకు వివరించారు. పోలీసు జాగిలాలు పేలుడు పదార్థాలను గుర్తించే విధానంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎస్పీ కృష్ణారావు మాట్లాడుతూ మహిళలను గౌరవించడం మన ధర్మం, భారతీయ సంస్కృతని పేర్కొన్నారు. సోషల్ మీడియాలో మహిళలకు సంబంధించి ఇబ్బందికర వీడియోలు పెడుతుంటారని, వాటిని చూడొద్దని ఆయన విద్యార్థులకు సూచించారు. పేలుడు పదార్థాలను వాసన చూసే సమయంలో జాగిలం ఊపరితిత్తులు దెబ్బతింటాయని, దాని జీవితకాలం తగ్గిపోతుందని వివరించారు. జాగిలాలే ఏమీ ఆశించకుండా రక్షణలో భాగమైనప్పుడు, మనుష్యులు కూడా మంచి ప్రవర్తన కలిగి ఉండాలని తెలిపారు. ట్రాఫిక్ రూల్స్ కచ్చితంగా పాటించాలని, తప్పనిసరిగా హెల్మెట్ వాడాలని సూచించారు. పోలీసు బ్యాండ్ ప్రదర్శన విద్యార్థులను విశేషంగా ఆకట్టుకుంది. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ(అడ్మిన్) జేవీ సంతోష్, ఏఆర్ అడిషనల్ ఎస్పీ వి.సత్తిరాజు, ఏఆర్ డీఎస్పీ జి.మహాత్మా గాంధీ, వెల్పేర్ ఆర్‌ఐ ఎల్.గోపీనాథ్, ఏఎన్‌ఎస్ ఆర్‌ఐ యువరాజ్, ఎంటీఆర్‌ఐ కృష్ణ, అడ్మిన్ ఆర్‌ఐ యం.రాజా పాల్గొన్నారు.
ఆకట్టుకున్న పోలీసు ఓపెన్ హౌస్
ఆకట్టుకున్న పోలీసు ఓపెన్ హౌస్


