ఇండో–ఇజ్రాయెల్ ప్రాజెక్టు పనులు వేగవంతం చేయాలి
నకరికల్లు: ఇండో–ఇజ్రాయెల్ ప్రాజెక్టు పనులు త్వరితగతిన పూర్తిచేయాలని పల్నాడు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా ఆదేశించారు. మండలంలోని గుండ్లపల్లి సమీపంలో నిర్మాణ దశలో ఉన్న ప్రాజెక్టు పనులను శనివారం ఆమె పరిశీలించారు. జాప్యం కావడంపై ప్రత్యేకంగా ఆరా తీశారు. పరిశోధన కేంద్రాల భవనాల నిర్మాణాలను తనిఖీ చేశారు. ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం నుంచి త్వరితగతిన నిధులు విడుదలయ్యేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. పనులు ఆలస్యం కాకుండా యుద్ధప్రాతిపదికన చేపట్టాలని చెప్పారు. కార్యక్రమంలో జిల్లా ఉద్యాన అఽధికారి ఐ.వెంకట్రావు, నరసరావుపేట హార్టీకల్చర్ ఇన్‌చార్జి షేక్ నబీరసూల్, తహసీల్దార్ కె.పుల్లారావు, ఎంపీడీఓ జి.కాశయ్య, డెప్యూటీ ఎంపీడీఓ కె.వి.శివప్రసాద్, డెప్యూటీ తహసీల్దార్ కొండారెడ్డి, హార్టీకల్చర్ అధికారులు పాల్గొన్నారు.
పత్తి పంటను రక్షించేందుకు చర్యలు చేపట్టండి
వెల్దుర్తి: పత్తి పంటను రక్షించేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కృతికా శుక్లా వ్యవసాయాధికారులను ఆదేశించారు. వెల్దుర్తిలో వర్షాలకు దెబ్బతిన్న పత్తి పంటను శనివారం ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలకు పంటలు పాడైపోతున్నాయన్నారు. రైతులకు పలు సూచనలు చేసి కాపాడేందుకు తగిన చర్యలు తీసుకోవాలని వ్యవసాయాధికారులకు చెప్పారు. పత్తి చేలల్లో నిలిచిన నీటిని వెంటనే బయటకు పంపాలని రైతులకు చెప్పారు. వ్యవసాయాధికారుల సూచనల మేరకు రైతులు పంటలను కాపాడుకునేందుకు ముందుకు రావాలని ఆమె కోరారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖాధికారి జగ్గారావు, మాచర్ల ఏడీఏ జగదీశ్వరరెడ్డి, వెల్దుర్తి ఏఓ బాలాజీ గంగాధర్, తహసీల్దార్ రాజశేఖర్ నాయుడు పాల్గొన్నారు.
వాటర్ గ్రిడ్ పథకం పనుల పరిశీలన
మాచర్ల రూరల్: ప్రతి ఇంటికీ తాగునీరందించే జలజీవన్ మిషన్ ద్వారా నిర్మిస్తున్న వాటర్ గ్రిడ్ పథకం పనుల్లో నాణ్యత లోపించకుండా సకాలంలో పూర్తి చేయాలని కలెక్టర్ కృతికా శుక్లా ఆదేశించారు. ఎప్పటికప్పుడు తనకు నివేదిక అందించి పనులు త్వరగా పూర్తయ్యేలా చూడాలని కోరారు. శనివారం మండలంలోని రాయవరంలో పనులను పరిశీలించిన అనంతరం ఆమె మాట్లాడారు. వెనుకబడిన పల్నాటి ప్రాంత దాహార్తిని తీర్చేందుకు ఈ పథకం ఎంతగానో దోహదపడుతుందని పేర్కొన్నారు. ప్రాజెక్టు పూర్తయితే ప్రజల తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని చెప్పారు. కార్యక్రమంలో గ్రామీణ నీటి పారుదల శాఖ ఈఈ సత్యనారాయణ పాల్గొన్నారు.
కలెక్టర్ కృతికా శుక్లా


