పెన్షనర్ల సంఘం జిల్లా కార్యవర్గం ఎన్నిక
నరసరావుపేట ఈస్ట్: రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల సంఘం పల్నాడు జిల్లా శాఖ అధ్యక్షుడిగా మానం సుబ్బారావు, కార్యదర్శిగా సి.సి.ఆదెయ్య, కోశాధికారిగా ఎంఎస్‌ఆర్‌కే ప్రసాద్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పెన్షనర్స్ భవన్‌లో శనివారం జరిగిన సంఘం పల్నాడు జిల్లా శాఖ సర్వసభ్య సమావేశంలో నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సంఘం గౌరవాధ్యక్షునిగా లంకా రంగనాయకులు, అసోసియేట్ ప్రెసిడెంట్‌గా కె.వి.చలపతిరావు, ఆర్గనైజింగ్ సెక్రటరీగా చేగిరెడ్డి ఈశ్వరరెడ్డి, ముఖ్య సలహాదారునిగా పూజల హనుమంతరావుతోపాటు ఆరుగురు ఉపాధ్యక్షులు, ఆరుగురు సహాయ కార్యదర్శులు, మరో 25మంది కార్యవర్గ సభ్యులతో కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఎన్నికల పరిశీలకునిగా సంఘం రాష్ట్ర కార్యదర్శి జి.రామకృష్ణారెడ్డి వ్యవహరించారు. నూతన కార్యవర్గం మూడు సంవత్సరాలు బాధ్యతలను నిర్వహించనుంది. నూతన అధ్యక్షుడు సుబ్బారావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పెన్షనర్లు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరారు. పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర కమిటీ సూచనలు, కార్యాచరణ మేరకు చిత్తశుద్ధితో కృషి చేస్తామని తెలిపారు.


