
త్రికోటేశ్వరునికి కార్తిక పూజలు
నరసరావుపేట రూరల్: కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామికి బుధవారం విశేష అభిషేకాలు, ప్రత్యేక అలంకరణలు నిర్వహించారు. కార్తిక మాసం తొలిరోజు కావడంతో భక్తులు అధిక సంఖ్యలో స్వామి వారిని దర్శించుకున్నారు. తెల్లవారుజామున స్వామి వారికి విశేష ద్రవ్యాలతో రుద్రాభిషేకం నిర్వహించారు. అనంతరం భక్తులను దర్శనానికి అనుమతించారు. అయ్యప్ప మాలధారులు, భక్తులు స్వామి వారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించారు.
సత్రశాల(రెంటచింతల): కార్తిక మాసం ప్రారంభం సందర్భంగా సత్రశాలలోని శ్రీగంగా భ్రమరాంబ సమేత మల్లిఖార్జునస్వామిని బుధవారం భక్తులు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా భ్రమరాంబికాదేవి అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించారు. దేవస్థానం ప్రధాన అర్చకులు చిట్టేల శివశర్మ నేతృత్వంలో స్వామివార్లకు ప్రత్యేక పూజలతోపాటు పంచామృతాభిషేకాలు, కుంకుమార్చన, చండిహోమాలు నిర్వహించారు. భక్తులకు గుండా వెంకట శివయ్య, చపారపు అంకిరెడ్డి, చపారపు అబ్బిరెడ్డి ఏర్పాటు చేసిన మహాన్నదాన కార్యక్రమాన్ని దేవస్థానం ట్రస్ట్‌బోర్డు చైర్మన్ గుండా వెంకట శివయ్య ప్రారంభించారు. ఈఓ గాదె రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
నరసరావుపేట: ఏపీ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 29వ తేదీన కేసానుపల్లి సమీపంలోని ఈశ్వర్ ఇంజినీరింగ్ కళాశాలలో జాబ్‌మేళా నిర్వహించనున్నారు. ఈ మేరకు బుధవారం మేళాకు సంబంధించిన గోడ పత్రికను జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా తన కార్యాలయంలో ఆవిష్కరించారు. పల్నాడు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి తమ్మాజీరావు మాట్లాడుతూ మేళాలో సుమారు 30కి పైగా కంపెనీలు పాల్గొంటున్నాయని అన్నారు. జీతం వారి విద్యార్హతను బట్టి సుమారు రూ.12 వేల నుంచి రూ.40 వేల వరకు ఉండవచ్చని తెలిపారు. రామాంజనేయులు, రవీంద్రనాయక్, ఈశ్వర్ ఇంజినీరింగ్ కళాశాల కరస్పాండెంట్ అబ్దుల్ కరీమ్ పాల్గొన్నారు.
అమరావతి: మండల పరిధి గ్రామాలలో 2017 సంవత్సరంలో సంచలనం సృష్టించిన జంట హత్యల క్రిమినల్ కేసును కొట్టివేసినట్లు బుధవారం గుంటూరు నాలుగవ అదనపు జిల్లా జడ్జి శరత్ బాబు తీర్పు వెలువరించారు. కేసు వివరాల ప్రకారం.. 2017 ఆగస్టు 15న అమరావతికి చెందిన మసక లక్ష్మి, బత్తుల ఫణి అనే ఇద్దరు మహిళలను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసి అమరావతి–నరుకుళ్ళపాడు గ్రామాల మధ్య వాగులో మృతదేహాలను పడేశారు. అప్పట్లో అమరావతి పరిసర ప్రాంతాలలో తీవ్ర సంచలనం సృష్టించిన ఈ ఘటనపై సీఐ మురళీకృష్ణ కేసు నమోదు చేశారు. దర్యాప్తులో వైకుంఠపురం గ్రామానికి చెందిన పల్లా సత్యనారాయణ పై కేసు నమోదు చేశారు. నిందితుడి తరఫున అమరావతికి చెందిన న్యాయవాది మేకల హనుమంతరావు కోర్టులో వాదనలు వినిపించారు. సాక్ష్యాలు చూపి నేరాన్ని నిరూపించ లేకపోవడంతో నిందితుడిని నిర్దోషిగా తేల్చి కేసును న్యాయస్థానం కొట్టివేసింది.
పెదకూరపాడు : గారపాడులోని గ్రామ దేవత గంగమ్మ తల్లి ఆలయంలో మంగళవారం రాత్రి దొంగలు హుండీలను అపహరించారు. ఆలయం బయట ఉన్న హుండీని ఇనుప రాడ్లతో పగలగొట్టి అందులో ఉన్న నగదును దొంగిలించారు. గర్భగుడిలోని హుండీని తీసుకువెళ్లారు. బుధవారం తెల్లవారుజామున వచ్చిన భక్తులు గమనించి దేవాలయం కమిటీ దృష్టికి తీసుకువచ్చారు. కమిటీ సభ్యులు పెదకూరపాడు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

త్రికోటేశ్వరునికి కార్తిక పూజలు