
తమ్ముళ్ల దోపిడీకి జీఎంసీ ‘పీ..పీ..పీ..’
మేయర్ వార్డులో పనుల కోసం..
రూ. కోట్ల విలువైన భూములు, ఆస్తుల ధారాదత్తమే అజెండా
● కార్పొరేషన్ భూములను తమ వారికి
కట్టబెట్టేందుకు తమ్ముళ్ల యత్నం
● నార్ల వెంకటేశ్వరరావు ఆడిటోరియాన్ని
అన్నమయ్య ట్రస్టుకి ఇచ్చేందుకు చర్యలు
● రూ.వందల కోట్ల బడ్జెట్ ఉన్నా
రూ. 6 కోట్లు ఖర్చు చేయలేమని సాకులు
● రూ. 70 కోట్ల విలువైన స్థలం
20 ఏళ్లపాటు ప్రైవేట్ వ్యక్తులకు
కట్టబెట్టేందుకు యత్నం
● ఇప్పటికే చిన్మయా, వెంకటేశ్వర బాల
కుటీర్‌కు కార్పొరేషన్ స్థలాలు అప్పగింత
● నేడు కౌన్సిల్ ప్రత్యేక సమావేశం
నిర్వహణకు ఏర్పాట్లు
సాక్షి ప్రతినిధి, గుంటూరు: బృందావన్ గార్డెన్స్‌లోని ప్రభుత్వ స్థలంలో నార్ల వెంకటేశ్వరరావు ఆడిటోరియం నిర్మాణానికి 1999లో అప్పటి సీఎం చంద్రబాబు చేతుల మీదుగా శంకుస్థాపన చేశారు. వివిధ కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తున్న ఈ ఆడిటోరియం ప్రస్తుతం శ్లాబు దశ పూర్తి చేసుకుంది. ఫినిషింగ్ మాత్రమే మిగిలి ఉంది. సుమారు రూ.ఆరు కోట్లు ఖర్చు పెడితే నగరానికే తలమానికంగా మారనుంది. కానీ ఆడిటోరియంపై టీడీపీ నేతల కళ్లు పడ్డాయి. పబ్లిక్ ప్రైవేటు భాగస్వామ్యం పేరుతో ఓ ప్రైవేటు సంస్థకు అప్పగించేందుకు తతంగాన్ని పూర్తి చేశారు. రూ.1500 కోట్ల బడ్జెట్ ఉన్న నగరపాలక సంస్థకు రూ.ఆరు కోట్లు ఖర్చు చేయడం పెద్ద పనేం కాదు. కానీ తమ వారికి కట్టబెట్టేందుకు రంగం సిద్ధం చేశారు. దీని వెనుక కేంద్ర మంత్రి సహకారం ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే నగరపాలక సంస్థకు చెందిన విలువైన స్థలాలను చిన్మయా విద్యాసంస్థలు, వెంకటేశ్వర బాలకుటీర్‌కు అప్పగించిన అధికారులు ఇప్పుడు మరో విలువైన స్థలాన్ని అన్యాక్రాంతం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.
గుట్టుచప్పుడు కాకుండా...
గతంలోనే ఈ అంశాన్ని టేబుల్ అజెండాగా పెట్టి చర్చించకుండానే ఆమోదించినట్లు ప్రభుత్వానికి పంపించారు. దీనిపై వివరాలు కావాలని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ నుంచి లేఖ రావడంతో దీన్ని మళ్లీ కౌన్సిల్ ముందుకు పెట్టారు. అభివృద్ధి ప్రాజెక్టు పరిధి మరియు వినియోగం, పీపీపీ ఒప్పందపు కాల వ్యవధి, గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్‌కు లభించే ఆదాయం వాటా, నిర్మాణ స్థిరత్వ బాధ్యత, ప్రాజెక్టు హక్కు/హోదా, ఒప్పందం నిబంధనలు కావాలని ప్రభుత్వం కోరింది. దీంతో విజయవాడకు చెందిన వీఆర్ సిద్ధార్థ ఇంజినీరింగ్ కాలేజీ నుంచి నివేదిక తెప్పించారు. రూ.8 లక్షలు ఖర్చు చేసి కన్సల్టెన్సీ నుంచి నివేదిక తయారు చేయించారు. ఆడిటోరియం పూర్తి అయిన తర్వాత వచ్చే ఆదాయంలో 60 శాతం కార్పొరేషన్‌కు, 40 శాతం అన్నమయ్య సేవా సమితికి కేటాయించేలా ఒప్పందం తయారు చేశారు. అయితే దీనికి సంబంధించిన ఏ సమాచారం కూడా కార్పొరేటర్లకు ఇప్పటి వరకు ఇవ్వలేదు. అసలు ఒప్పందంలో ఏ అంశాలు ఉన్నాయి, కన్సల్టెన్సీ నివేదికలో ఏముంది? ఈ ఒప్పందాన్ని మొత్తం మున్సిపల్ కమిషనర్ ఆమోదించారా? ఎవరితో చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు? వంటి అంశాలేవీ ఇప్పటి వరకూ కౌన్సిల్ ముందు ఉంచలేదు. కార్పొరేషన్ తీరు, టీడీపీ నాయకుల వైఖరిపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది.
నగర మేయర్ ప్రాతినిధ్యం వహిస్తున్న 37వ వార్డులో పలు అభివృద్ధి పనుల కోసం కౌన్సిల్ ఆమోదం కోసం చర్చించనున్నారు. కేవలం 37వ డివిజన్‌లోనే రూ.2.60 కోట్ల వర్కుల ఆమోదానికి అత్యవసర సమావేశంలో అంశాలను చేర్చారు. ఇంత అత్యవసరంగా మేయర్ వార్డులో అభివృద్ధి కార్యక్రమాలు, నార్ల ఆడిటోరియం అంశాలపై సమావేశం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏం వచ్చిందని పలువురు కార్పొరేటర్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రభుత్వ వైద్య కళాశాలలను పీపీపీ పేరు చెప్పి ప్రైవేటీకరణకు రంగం సిద్ధం చేశారు. అదే బాటలో గుంటూరు తమ్ముళ్లు కూడా నడుస్తున్నారు. సుమారు రూ.70 కోట్ల విలువైన స్థలంలో నిర్మాణంలో ఉన్న నార్ల వెంకటేశ్వరరావు ఆడిటోరియాన్ని ఒక సంస్థకు పీపీపీ పద్ధతిలో కట్టబెట్టేందుకు పావులు కదుపుతున్నారు. దీనికోసం ఏకంగా గురువారం ప్రత్యేక కౌన్సిల్ సమావేశాన్నే ఏర్పాటు చేసేశారు.