
టెన్త్ విద్యార్థులకు స్టడీ మెటీరియల్ సిద్ధం చేయాలి
గుంటూరు ఎడ్యుకేషన్: ఉమ్మడి గుంటూరుజిల్లాలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలల నుంచి టెన్త్ పబ్లిక్ పరీక్షలకు సన్నద్ధమవుతున్న విద్యార్థులకు పంపిణీ చేసేందుకు స్టడీ మెటీరియల్ సిద్ధం చేయాలని జెడ్పీ చైర్‌పర్సన్ కత్తెర హెనీ క్రిస్టినా పేర్కొన్నారు. బుధవారం జెడ్పీ కార్యాలయంలోని తన చాంబర్లో గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాల డీఈఓలతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. విద్యాశాఖ నుంచి స్టడీ మెటీరియల్ త్వరగా అందిస్తే జెడ్పీ నిధులతో ముద్రణ ప్రక్రియను వేగవంతం చేసి, డిసెంబర్ నాటికి పాఠశాలలకు అందజేయగలుగుతామని తెలిపారు. అదే విధంగా టెన్త్ విద్యార్థులకు జెడ్పీ నిధులతో అల్పాహారాన్ని పంపిణీ చేసే విషయమై నిర్ణయం తీసుకుంటాయని పేర్కొన్నారు. సమావేశంలో జెడ్పీ సీఈఓ వి.జ్యోతిబసు, గుంటూరు జిల్లా విద్యాశాఖాధికారి సీవీ రేణుక, పల్నాడు, బాపట్ల జిల్లాల విద్యాశాఖాధికారులు పాల్గొన్నారు.
గుంటూరు ఎడ్యుకేషన్: కౌశల్–2025 పేరుతో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి సైన్స్ క్విజ్ పోటీలకు విద్యార్థులను సన్నద్ధం చేయాలని జిల్లా విద్యాశాఖాధికారి సీవీ రేణుక బుధవారం ఓప్రకటనలో తెలిపారు. భారతీయ విజ్ఞానమండలి, ఏపీ సైన్స్ సిటీ, అప్‌కాస్ట్ సంయుక్తంగా తిరుపతిలో నవంబర్ 27న జరగనున్న రాష్ట్రస్థాయి పోటీలకు జిల్లా నుంచి అత్యధిక సంఖ్యలో రిజిస్ట్రేషన్లు చేయించాలని ప్రధానోపాధ్యాయులకు సూచించారు. ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో 8,9,10 తరగతులు చదువుతున్న విద్యార్థులకు క్విజ్, రీల్ పోటీలతో పాటు, పోస్టర్ కాంపిటీషన్స్ జరుగుతాయని వివరించారు. పాఠశాలస్థాయిలో 8,9,10 తరగతుల విద్యార్థులకు నవంబర్ 1,2,3వ తేదీలతో పాటు జిల్లాస్థాయిలో నవంబర్ 27, 28వ తేదీల్లో పోటీలు నిర్వహిస్తారని పేర్కొన్నారు.
తాడికొండ: క్వారీ గుంతలో పడి పశువుల కాపరి మృతి చెందిన ఘటన తాడికొండ మండలం కంతేరు గ్రామం సమీపంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కంతేరు గ్రామ శివారు ఆర్‌యూబీ సమీపంలోని బ్రిక్స్ ఇండస్ట్రీ పక్కన ఉన్న క్వారీ గుంతల సమీపంలో పెదకాకాని మండలం కొప్పురావూరు గ్రామానికి చెందిన తోట ప్రసాదరావు(65) అనే వృద్ధుడు మంగళవారం పశువులను మేపేందుకు ఉదయం 10 గంటల సమయంలో వెళ్లాడు. సాయంత్రం 4 గంటల సమయంలో క్వారీ గుంతలో ప్రమాదవశాత్తు పడిపోయాడని తెలిసిన వ్యక్తి మృతుడి కుమారుడికి తెలిపాడు. ఒడ్డున ఉన్న దుస్తులు గమనించి తన తండ్రికి చెందినవిగా గుర్తించి క్వారీ గుంతలలో గాలించినా ఎలాంటి ప్రయోజనం లభించలేదు. బుధవారం మృతుడి శవం నీటిలో తేలియాడటంతో గమనించి తాడికొండ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తన తండ్రి అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడని కుమారుడు తోట సాంబశివరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ కె.వాసు తెలిపారు.