
నేరాల నియంత్రణకు కార్డన్ సెర్చ్
చిలకలూరిపేట: అసాంఘిక కార్యకలాపాలు, నేరాల నియంత్రణలో భాగంగా కార్డన్ సెర్చ్ ఏర్పాటు చేసినట్లు నరసరావుపేట డీఎస్పీ ఎం హనుమంతరావు చెప్పారు. మంచినీటి చెరువుల రోడ్డులోని 52 ఎకరాల టిడ్కో గృహ సముదాయంలో బుధవారం తెల్లవారుజాము నుంచి కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎవరైనా అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడినా, మారణాయుధాలు కలిగి ఉన్నా క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. గంజాయి, డ్రగ్స్ వంటి వాటిని సరఫరా చేస్తే ఎంతటి వారినైనా వదిలేది లేదని వెల్లడించారు. గృహ సముదాయంలో ఎవరెవరు నివాసం ఉంటున్నారు? గుర్తు తెలియని వ్యక్తులు ఎవరైనా ఉంటున్నారా ? తదితర అంశాలను కార్యక్రమం ద్వారా పరిశీలించినట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా సరైన ధ్రువీకరణ పత్రాలు లేని 103 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పత్రాలు సమర్పించిన 70 వాహనాలను విడుదల చేశారు. మిగిలిన వాహనాలకు పత్రాలు సమ ర్పించాలని, లేనిపక్షంలో సీజ్ చేసి పోలీసు స్టేషన్‌కు తరలిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో అర్బన్ సీఐ పి. రమేష్, రూరల్ సీఐ బి. సుబ్బానాయుడు, సబ్ డివిజన్ పరిధిలోని ఆరుగురు సీఐలు, 15 మంది ఎస్‌ఐలు, 140 మంది పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
నరసరావుపేట డీఎస్పీ హనుమంతరావు

నేరాల నియంత్రణకు కార్డన్ సెర్చ్