
తురకపాలెం ఘటనతో భయాందోళనలు
గుంటూరు జిల్లా తురకపాలెంలో మెలియాయిడోసిస్ వ్యాధితో పదుల సంఖ్యలో మరణాలు సంభవించిన ఘటన మరువక ముందే జిల్లాలో ఆ వ్యాధి లక్షణాలు బయటపడటంతో భయాందోళనలు నెలకొన్నాయి. ప్రభుత్వం తురకపాలెం మాదిరి అలసత్వం వహించకుండా వెంటనే స్పందించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. గ్రామంలో వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి విరివిగా రక్త పరీక్షలు చేసి మెలియాయిడోసిస్ లక్షణాలను గుర్తించాల్సి ఉంది. జ్వరపీడితుల వివరాలు ఇంటింటికి వెళ్లి ఆరా తీసి తగిన చికిత్స అందించాల్సి ఉంది. సుమారు 342 మంది జనాభా ఉన్న గ్రామంలో ప్రస్తుతం బాధితుడి ఇంట్లో కుటుంబ సభ్యులకు మాత్రమే రక్త నమూనాలను తీసి ల్యాబ్‌కు పంపినట్టు సమాచారం. ప్రత్యేక క్యాంపులు నిర్వహించి అనుమానితులకు పరీక్షలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరోవైపు పారిశుద్ధ్యం సరిగా లేకపోతే మెలియాయిడోసిస్ వ్యాఽధి మరింత మందికి వచ్చే అవకాశాలున్న నేపథ్యంలో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి ఇళ్ల మధ్య, రోడ్లు, కాలువులను శుభ్రం చేయాల్సి ఉంది.