
క్రోసూరులో ఇంటిపై పడిన పిడుగు
స్లాబ్ దిమ్మె, వరండాకు పగుళ్లు విద్యుత్ పరికరాలు ధ్వంసం
క్రోసూరు: పిడుగుపాటులో ఇంటి శ్లాబ్ పాక్షికంగా ధ్వంసమైన ఘటన శనివారం వేకువజామున చోటుచేసుకుంది. బాధితుడు తెలిపిన వివరాలు.. క్రోసూరులోని కటకం కల్యాణ మండపం ఎదురు బజారు(కొత్తూరు)లో షేక్ నాగూరు ఉంటున్నాడు. తెల్లవారుజామున ఇంటిపై పిడుగు పడింది. పిడుగు ధాటికి ఇంటి వరండా స్లాబ్ బీటలు వారింది. ఇంటిలోని విద్యుత్‌మీటర్ కాలిపోయింది. ఫ్రిజ్, ఫ్యాన్లు, వాషింగ్ మిషన్లు పూర్తిగా పాడయ్యాయి. ఇంటి ముందు ఉన్న విద్యుత్ స్తంభం తీగలు తెగిపడిపోయాయి. అంతేకాకుండా అదే వీధిలోని అనేక మంది ఇళ్లలో విద్యుత్ పరికరాలు, నీళ్ల మోటార్లు, టీవీలు, పాడయినట్లు స్థానికులు తెలిపారు. ఘటనా స్థలాన్ని మాజీ శాసనసభ్యుడు నంబూరు శంకరావు సందర్శించి బాధితుడిని పరామర్శించారు. వీఆర్వో లేళ్ల బ్రహ్మనాయుడు బాధితుడి నుంచి వివరాలు సేకరించారు.