
పేటలో దంచికొట్టిన వాన
నరసరావుపేట రూరల్/నరసరావుపేట: మండలంలో శుక్రవారం రాత్రి పిడుగులతో కూడిన భారీ వర్షం కురవడంతో ప్రజలు హడలెత్తారు. రాత్రి 10 గంటలకు ప్రారంభమైన వాన ఉరుములు, పిడుగులతో క్రమంగా పెరిగింది. భారీ శబ్దాలతో పిడుగులు పడ్డాయి. దాదాపు రెండు గంటలపాటు నరసరావుపేట సమీప ప్రాంతాలు దద్దరిల్లాయి. భారీ వర్షంతో మండలంలోని వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. పెదరెడ్డిపాలెం, గోనెపూడి గ్రామాల సమీపంలోని చప్టాల మీద నీరు ప్రవహించింది. వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. మెట్ట పంటలకు తీవ్ర నష్టం కలుగుతోందని రైతులు ఆందోళన చెందుతున్నారు. పూత, పిందె దశలో ఉన్న పత్తి పంటకు కూడా నష్టం ఎక్కువగా ఉందని తెలిపారు.
అపార్టుమెంట్‌పై పడిన పిడుగు
పెద్దచెరువు నుంచి వల్లప్పచెరువుకు వెళ్లే రోడ్డులోని ఓ అపార్టుమెంట్‌పై శుక్రవారం రాత్రి పిడుగు పడింది. టెర్రస్‌పైనున్న పిట్టగోడ కొద్దిభాగం ధ్వంసమైంది. దీని ధాటికి లిప్ట్‌కు ఉపయోగపడే ఎలక్ట్రికల్ బోర్డు కాలిపోయింది. లిఫ్ట్ ఆగినా అందులో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. గడిచిన 24 గంటల వ్యవధిలో జిల్లాలోని 28 మండలాలకుగాను 17 మండలాల్లో వాన కురిసింది. అత్యధికంగా ముప్పాళ్ల మండలంలో 72.6 మి.మీ. పడింది. నరసరావుపేటలో 45, నాదెండ్ల 4.2, చిలకలూరిపేట 16.6, రొంపిచర్ల 4.6, ఈపూరు 3.6, నూజెండ్ల 2.8, నకరికల్లు 20.6, రాజుపాలెం 21.8, సత్తెనపల్లి 54.8, పెదకూరపాడు 7.4, అమరావతి 30.4, క్రోసూరు 20.8, అచ్చంపేట 60.6, బెల్లంకొండ 12.6, మాచవరం 5.4, పిడుగురాళ్లలో 8.6 మి.మీ. చొప్పున వర్షపాతం నమోదైంది.

పేటలో దంచికొట్టిన వాన