
జీవితాంతం వైఎస్సార్‌సీపీతోనే ఉంటాం
ముప్పాళ్ళ: వైఎస్సార్‌సీపీ అధినాయకత్వ నిర్ణయమే తమ నిర్ణయమని, ప్రాణం ఉన్నంత వరకు పార్టీతోనే ఉంటామని ఎంపీటీసీ సభ్యులు మలిరెడ్డి అనూష (లంకెలకూరపాడు),గోగుల అంజిబాబు (మాదల), షేక్ బందెల హుస్సేన్‌బీ (తొండపి)లు చెప్పారు. అమ్ముడుపోవడం.. కొనుక్కోవడం వైఎస్సార్‌సీపీ నైజం కాదని స్పష్టం చేశారు. మండలంలోని చాగంటివారిపాలెం గ్రామంలోని శ్రీసాయిబాబా ఆలయ ఆవరణలో శనివారం వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ గజ్జల సుధీర్ భార్గవరెడ్డితో కలసి వారు విలేకరులతో మాట్లాడారు. కూటమి నాయకులు ఎంపీపీ పదవి కోసం అడ్డదారులు తొక్కుతూ వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీలపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండి పడ్డారు. ఎవరి ప్రలోభాలకూ లొంగబోమని, చివరివరకు వైఎస్సార్‌సీపీతోనే ఉంటామని చెప్పారు. పరాయి బిడ్డను తమ బిడ్డగా చెప్పుకుంటున్న తెలుగుదేశం పార్టీ నాయకులు సిగ్గుపడాలన్నారు. వైఎస్సార్‌సీపీ తరఫున గెలిచి, పదవుల కోసం టీడీపీ నాయకుల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సిన అవసరం తమకు లేదన్నారు. తమపై ఎన్ని కేసులు పెట్టినా భయపడేదే లేదన్నారు. వైఎస్సార్‌సీపీ నాయకుల నిర్ణయమే తమ నిర్ణయమని తేల్చి చెప్పారు. అనంతరం నియోజకవర్గ సమన్వయకర్త పుట్టిన రోజు సందర్భంగా కేక్ కట్ చేయించి, ఆయన్ను శాలువాతో సన్మానించారు. వైఎస్సార్‌సీపీ నాయకులు ఎంజేఎం రామలింగారెడ్డి, ఇందూరి నరసింహా రెడ్డి, రెండెద్దుల వెంకటేశ్వర రెడ్డి, ప్రభాకరరెడ్డి, యనమాల సింగయ్య, అన్నపురెడ్డి శ్రీనివాసరెడ్డి, కాటయ్య తదితరులు పాల్గొన్నారు.
ఎంపీటీసీ సభ్యులు