
ఓవర్ హెడ్ ట్యాంకుపై రాజకీయ నీడలు
వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలోనే ట్యాంకు పనులు పూర్తి
జనవరిలో పైపులైన్‌కు శంకుస్థాపన
పది నెలలు గడుస్తున్నా పట్టించుకోని అధికారులు
తాగునీటికి ఇబ్బందులు పడుతున్న ప్రజలు
స్థానిక ఎన్నికల కోసం ఎదురుచూస్తున్న కూటమి ప్రజాప్రతినిధులు
పైపుల కోసం ఎదురుచూస్తున్నాం
నరసరావుపేట: ప్రజల తాగునీటి అవసరాలను తీర్చడంలో చొరవ చూపాల్సిన కూటమి నేతలు రాజకీయ లబ్ధి కోసం వారిని ఇబ్బందులకు గురిచేస్తున్నారు. పట్టణంలో సుమారు రూ.1.50 కోట్ల వ్యయంతో నిర్మించిన ఓవర్‌హెడ్ వాటర్ ట్యాంకు, డిస్ట్రిబ్యూషన్ పైపులైను వినియోగంలోకి తీసుకురాకుండా వదిలేశారు. దీంతో సుమారు పది నుంచి 15వేల మంది ప్రజలు తాగునీటి కోసం అవస్థలు పడుతున్నారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో నిర్మాణం ప్రారంభమైన ఓవర్ హెడ్ ట్యాంకును వచ్చే స్థానిక మున్సిపల్ ఎన్నికల నాటికి ప్రారంభించి తామే ఏర్పాటు చేశామంటూ ఓట్లు కొల్లగొట్టేందుకు కూటమి ప్రజాప్రతినిధులు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వ్యక్తమౌతున్నాయి. వివరాలు ఇలా ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం అమృత పథకం(అటల్ మిషన్ ఫర్ రెజోనేవేషన్ ఆఫ్ అర్బన్ ట్రాన్స్‌ఫార్మేషన్) కింద నరసరావుపేట పురపాలక సంఘానికి గత ప్రభుత్వంలో రూ.5 కోట్లు కేటాయించింది. వివిధ అభివృద్ధి పథకాలు చేపట్టగా మిగిలిన సుమారు రూ.కోటి నిధులతో శ్రీనివాసనగర్, ఇస్లాంపేట, కోటప్పకొండరోడ్డుతోపాటు రవీంద్రనగర్, ఆ మార్గంలోని పలు ఏరియాలలో నివాసం ఉండే వారికి తాగునీరు అందజేసేందుకు మార్కెట్ యార్డులో ఓవర్‌హెడ్ వాటర్ ట్యాంకు నిర్మాణం చేపట్టారు. అప్పటి ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి 2023లో శంకుస్థాపన చేశారు. ఇప్పుడా ఆ రాయి కన్పించకుండా చేయటం గమనార్హం. యల్లమంద పంచాయతీ పరిధిలోని ప్రాంతాన్ని పురపాలక సంఘంలో కలుపుతూ తీసుకున్న నిర్ణయంతో అనేక నివాస ప్రాంతాలకు ఈ తాగునీరు అందాల్సి వుంది. గత ప్రభుత్వం దిగిపోయే నాటికి ఓవర్‌హెడ్ ట్యాంకు నిర్మాణం పూర్తయింది. దీని నుంచి నీరు అందజేసేందుకు చేపట్టిన డిస్ట్రిబ్యూషన్ పైపులైన్లు ఏర్పాటు చేయాల్సి వుంది. గతేడాది కూటమి ప్రభుత్వం బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఆర్నెల్లుపాటు పట్టించుకోని స్థానిక ప్రజాప్రతినిధులు ఈ ఏడాది జనవరిలో సుమారు రూ.44 లక్షల ఖర్చుతో డిస్ట్రిబ్యూషన్ పైపులైన్ల ఏర్పాటుకు శంకుస్థాపన చేశారు. 10 నెలలు కావొస్తున్నా ఆ పనులు ఇప్పటివరకు కార్యరూపం దాల్చలేదు. ఇప్పటికే వెంకటరెడ్డికాలనీలో ఉన్న ఓవర్ హెడ్ వాటర్ ట్యాంకు నుంచి ఆయా ప్రాంతాలకు తాగునీరు సరఫరా అవుతుంది. దీని వలన సక్రమంగా నీరు అందక స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. అనేక మంది నూతనంగా ఇళ్లకు నీటి కుళాయిలు ఏర్పాటుచేసుకున్నా నీరు సక్రమంగా అందట్లేదనే ఫిర్యాదులు ఉన్నాయి. వచ్చే మున్సిపల్ ఎన్నికల నాటికి పైపులైను నిర్మాణం పూర్తిచేసి నీటిని పంపిణీ చేయాలనే ఆలోచనలో కూటమి నేతలు ఉన్నట్లుగా తెలియవచ్చింది. తాము పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని సాధ్యమైనంత త్వరగా నీటి సరఫరా చేయాలని స్థానికులు కోరుతున్నారు.
పైపులైను నిర్మాణం కోసం వినియోగించే హెచ్‌డీ పైపులకు ఆర్డర్లు ఇవ్వటం జరిగింది. అవి రాష్ట్రంలో శ్రీకాళహస్తిలోని ఫ్యాక్టరీలోనే తయారవుతాయి. అవి రాగానే పైపులైను నిర్మాణం చేసి నూతన ప్రాంతాల్లో నివాసం ఉంటున్న ప్రజలకు కుళాయిలు మంజూరుచేసి తాగునీరు అందజేస్తాం.
–డి.రవికుమార్, మున్సిపల్ ఇంజినీరు

ఓవర్ హెడ్ ట్యాంకుపై రాజకీయ నీడలు

ఓవర్ హెడ్ ట్యాంకుపై రాజకీయ నీడలు