
కల్తీ మద్యంపై సీబీఐచే విచారణ చేయించాలి
నరసరావుపేట: రాష్ట్రంలో వెలుగుచూసిన అక్రమ కల్తీ మద్యం, మరణాలపై వెంటనే సీబీఐతో విచారణ చేయించి దోషులను అరెస్టుచేసి కఠినంగా శిక్షించాలని వైఎస్సార్ సీపీ జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్‌చేశారు. కల్తీ మద్యం రాకెట్ ప్రభుత్వ పెద్దల సహకారం లేనిదే జరగదని, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేష్‌ల అండదండలు పుష్కలంగా ఉన్నాయని స్పష్టం చేశారు. పార్టీ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో నారా వారీ అక్రమ మద్యం ప్రజలకు తాగునీరు కంటే చాలా సులభంగా లభ్యమౌతుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా దారుణంగా 70 వేల బెల్టుషాపులు నడిపిస్తున్నారన్నారు. అన్నమయ్య జిల్లా ములకల చెరువులో మూడు మెషీన్లతో నెలకు 45లక్షల బాటిళ్ల కల్తీ సారా తయారుచేయించి వివిధ బ్రాండ్ల లేబుళ్లు అంటించి మద్యం, బెల్టుషాపులకు సరఫరా చేశారన్నారు. సుమారుగా రూ.4,800 కోట్లు మద్యం ప్రియుల నుంచి కొల్లగొట్టారన్నారు.
రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు తరలిస్తుంటే ప్రభుత్వ యంత్రాంగం, పోలీసులు, ఎకై ్సజ్ శాఖలు ఏం చేస్తున్నాయని ప్రశ్నించారు. కల్తీ మద్యం తయారుచేసేందుకు ఇన్ని వేల లీటర్ల స్పిరిట్ ఎక్కడ నుంచి వచ్చిందని ప్రశ్నించారు. ఒక హాస్పిటల్‌లో స్పిరిట్ వాడాలంటే డ్రగ్ లైసెన్స్ తీసుకొని వాడాల్సిన పరిస్థితి ఉందన్నారు. ప్రభుత్వ పెద్దల సహకారం లేనిదే ఇంత భారీగా స్పిరిట్ లభ్యం కాదని, ఖచ్చితంగా దీని వెనుక ఎవరున్నారనేది తేలాల్సిన అవసరం ఉందన్నారు. దీని వెనుక రాష్ట్ర పెద్దలే ఉన్నారు కాబట్టి వారు చేయించే దర్యాప్తుపై తమకు నమ్మకం లేదని అన్నారు. తంబళ్లపల్లి టీడీపీ ఇన్‌చార్జి జయచంద్రారెడ్డి వైఎస్సార్ సీపీ కోవర్టు, మాజీ మంత్రి పెద్దిరెడ్డి అనుచరుడు అంటూ నిరాధారమైన ఆరోపణలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే పనిలో టీడీపీ మీడియా పనిచేస్తుందన్నారు. ఇంత ఘోరమైన స్కామ్ వారు చేస్తూ ఎటువంటి స్కామ్‌కు ఆస్కారంలేని గత ప్రభుత్వ మద్యం విధానంపై తప్పుడు కేసులు పెట్టి తమ పార్టీ నాయకులను జైళ్లపాలు చేశారన్నారు. ఎన్నికలకు ముందు మద్యం తాగేవారి కడుపుపై కొట్టారని మాట్లాడిన ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఇప్పుడెందుకు మాట్లాడటం లేదని అన్నారు. ప్రభుత్వ పెద్దలకు ముడుపులు అందుతున్నందునే వారు మాట్లాడటం లేదని, సీబీఐచే విచారణ చేయించి ప్రజలకు వాస్తవాలు తెలియచేయాలని డిమాండ్ చేశారు.
వైఎస్సార్ సీపీ జిల్లా కార్యనిర్వాహక
అధ్యక్షులు డాక్టర్ గోపిరెడ్డి