
రెండో సారి విచారణకు హాజరైన పీఆర్కే, పీవీఆర్
మాచర్ల బోదిలవీడు సమీపంలో ఐదు నెలల కిందట జరిగిన జవిశెట్టి వెంకటేశ్వర్లు, జవిశెట్టి కోటేశ్వరరావుల హత్య కేసులో విచారణకు వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, వైఎస్సార్ సీపీ యువజన విభాగం రాష్ట్ర నాయకులు పిన్నెల్లి వెంకట్రామిరెడ్డిలు శుక్రవారం రెండోసారి హాజరయ్యారు. ఈ కేసులో విచారణకు హాజరుకావాలంటూ మాచర్ల రూరల్ పోలీసులు వారికి నోటీసులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో రూరల్ సర్కిల్ కార్యాలయానికి విచారణ నిమిత్తం హాజరయ్యారు. శుక్రవారం ఉదయం10.30 నుంచి రాత్రి 7గంటల వరకు గురజాల డీఎస్పీ జగదీష్, రూరల్ సీఐ నఫీజ్ బాషాతోపాటు ఇతర అధికారులు వారిని విచారించారు.
మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 2గంటల వరకు భోజనం విరామమిచ్చారు. అనంతరం విచారణ కొనసాగించారు. రూరల్ పోలీసుస్టేషన్ ముందు పోలీసులు భారీగా మోహరించారు. బస్టాండ్‌కు వెళ్లే రోడ్డు నుంచి పీఆర్కే ఇంటి వరకు బారికేడ్లు ఏర్పాటు చేసి పోలీసులు బందోబస్తు నిర్వహించారు. ఆ మార్గంలో పార్టీ నాయకులను, కార్యకర్తలను అనుమతించలేదు.
అక్రమ కేసులు పెట్టడమే లక్ష్యం
వెల్దుర్తి మండలం గుండ్లపాడు గ్రామానికి చెందిన ఇరువురిని టీడీపీ అంతర్గత పోరుతో హత్య జరగగా తనపైన, తన సోదరుడుపైన అక్రమంగా కేసు నమోదు చేశారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పల్నాడు జిల్లా అధ్యక్షుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. విచారణకు వెళ్లి వచ్చిన అనంతరం శుక్రవారం రాత్రి ఆయన క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సుప్రీంకోర్టులో మధ్యంతర బెయిల్ పొంది ఉన్న తాము కోర్టు ఆదేశాల మేరకు రెండోసారి విచారణకు హాజరైనట్లు వెల్లడించారు. ఈ హత్యకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టంగా చెప్పడం జరిగిందన్నారు. పోలీసుల విచారణకు ఎప్పుడు పిలిచినా వచ్చేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. అక్రమ కేసులు పెట్టేందుకు ఈవిధంగా చేస్తున్నారన్నారు.