
మానసిక కల్లోలం.. అందుబాటులో ఔషధం
ప్రతి ఏడాది పెరుగుతున్న మానసిక సమస్యలు నేడు ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం
జాగ్రత్తలు తీసుకోవాలి....
సత్తెనపల్లి: జిల్లాలో 20 ఏళ్ల క్రితం ఒకరిద్దరు మాత్రమే మానసిక వ్యాధి చికిత్స నిపుణులు ఉండే వారు. ప్రస్తుతం పల్నాడు జిల్లాలో ప్రభుత్వ వైద్యశాలలో ఇరువురు ఉంటే ప్రైవేట్‌గా సుమారు 10 మందికిపైగా సైకియాట్రిస్టులు ఉన్నారు. పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేట ఏరియా వైద్యశాలలోని మానసిక వ్యాధుల విభాగం ఓపీకి రోజూ 20 నుంచి 25 మంది రోగులు వస్తున్నారు. అందులో 15 మంది కొత్తవారు ఉంటున్నారు. ఇక ప్రైవేటు వైద్యుల వద్దకు సైతం సగటున రోజూ 10 నుంచి 20 మంది వరకు చికిత్స కోసం వెళ్తున్నారు. సమాజంలో తీవ్రమైన మానసిక సమస్యలు (స్క్రిజోఫియా, మానియా, డిప్రెషన్ అతిగా మద్యపానం, మత్తు పదార్థాలు సేవించడం) వారు 3 శాతం, ఇతర మానసిక వ్యాధులు ఉన్నవారు 5 నుంచి 10 శాతం వరకు ఉంటారని వైద్యులు చెబుతున్నారు. లక్షణాలు గుర్తించి వెంటనే మానసిక వైద్యులను సంప్రదిస్తే రోగికి కౌన్సెలింగ్, మందుల ద్వారా నయం చేయవచ్చని వారు సూచిస్తున్నారు.
మానసిక వ్యాధి లక్షణాలు..
ఆందోళన, భయం, గుండెదడ, అధిక చెమట, కాళ్లు, చేతులు వణకడం, అనవసర ఆలోచనలు, చేసిన పనులే మళ్లీ మళ్లీ చేయడం, విచారం, పనిలో ఉత్సాహం లేకపోవడం, ఆకలి, నిద్ర లేకపోవడం, ఆత్మహత్య ఆలోచనలు, మతిమరుపు, జ్ఞాపకశక్తి తగ్గడం, ప్రవర్తనలో మార్పు, తనలో తానే నవ్వుకోవడం, మాట్లాడుకోవడం, ఇతరులను అనుమానించడం, అతి ఆనందం, అతి కోపం, ముసలితనంలో వచ్చే సమస్యలు, కలత నిద్ర, నిద్ర పట్టకపోవడం, నిద్రలో నడవటం, మాట్లాడటం, మూత్ర విసర్జన చేయడం, భయంకర కలవరింతలు, నిగ్రహశక్తి కోల్పోవడం వంటివి ప్రధాన లక్షణాలు.
మానసిక వ్యాధులకు కారణాలు ...
మానసిక ఒత్తిడి వల్లే అనారోగ్యం....
మానసిక ఒత్తిడి వల్ల కడుపులో గ్యాస్ (వాయువు), ఆవేశాకావేశాల వల్లే అధిక రక్తపోటు, అతిబద్ధకం వల్ల చెడు కొలెస్ట్రాల్ ఎక్కువగా పెరగడం, స్వార్థం, మొండితనం వల్ల డయాబెటిస్ (మధుమేహం), అతి విచారం వల్ల ఆస్తమా, ప్రశాంతత లోపించడం వల్లే గుండె కొట్టుకోవడంలో మార్పులు వస్తున్నాయని ఇటీవల వైద్యులు గుర్తించారు. శరీరంలో వచ్చే సర్వరోగాలకు మూల కారణాలు తరచి చూస్తే ఆహార అలవాట్లతోపాటు అధిక శాతం జీవనశైలి సంబంధమైనవేనని తెలుస్తోంది.
కరోనా వల్ల పెరిగిన మానసిక సమస్యల బాధితులను దృష్టిలో పెట్టుకుని మానసిక ఆరోగ్యానికి , వైద్యానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. మానసిక సమస్యలపై అవగాహన కల్పించి ప్రజలు ఇబ్బంది పడకుండా చేసేందుకు ప్రతి ఏడాది అక్టోబర్ 10న ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ‘ సాక్షి’ అందిస్తున్న ప్రత్యేక కథనం.
మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి. ఆందోళనకు గురిచేసే విషయాలను పట్టించుకోకూడదు. మద్యం, పొగతాగటం లాంటి వ్యసనాలకు దూరంగా ఉండాలి. కంటికి సరిపడా ఆరు నుంచి తొమ్మిది గంటలపాటు నిద్రపోవాలి. కుటుంబ సభ్యులందరితో కలిసి కొంత సమయాన్ని గడపాలి. రోజూ క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. మానసిక వ్యాధులకు మందులు ఉన్నాయి.
– డాక్టర్ వడ్డాది వెంకటకిరణ్,
మానసిక వ్యాధి నిపుణుల సంఘం
గుంటూరు జిల్లా అధ్యక్షుడు

మానసిక కల్లోలం.. అందుబాటులో ఔషధం