
తరగతి గది నుంచి పొలం వద్దకు..
యడ్లపాడు: పట్టణాల పరిధి దాటి, పల్లె బాట పట్టిన ఆ యువ సైన్యం... పుస్తకాల్లో చదివిన జ్ఞానాన్ని క్షేత్రస్థాయిలో నేర్చుకుంటోంది. వారే ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలోని బాపట్ల కళాశాల బీఎస్సీ అగ్రికల్చరల్ నాలుగో సంవత్సరం విద్యార్థులు. రూరల్ అగ్రికల్చరల్ వర్క్ ఎక్స్పీరియన్స్(రావే) ప్రోగ్రాంలో భాగంగా వీరు మండల కేంద్రమైన యడ్లపాడు, జగ్గాపురం, చాగంటివారిపాలెం, పమిడిపాడు, నార్నెపాడు గ్రామాలకు సెప్టెంబర్ 17న 31 మంది వచ్చారు. వీరిని ఆచార్య ఎన్‌జీరంగా యూనివర్సిటీ వ్యవసాయ విస్తరణ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎం.ఉష, జిల్లా ఏరువాక కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ నగేష్, విస్తరణ అధికారి డాక్టర్ సత్యగోపాల్ పర్యవేక్షిస్తున్నారు. స్థానిక అభ్యుదయ రైతులు డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయం పాలక మండలి విశ్రాంత సభ్యులు పోపూరి శివరామకృష్ణ, జాగర్లమూడి రామారావులతోపాటు మరో పది మంది శిక్షణ ఇస్తున్నారు. పుస్తకాల్లోని జ్ఞానాన్ని క్షేత్రస్థాయి వాస్తవాలతో వారు సరిచూసుకుంటున్నారు. రైతులే గురువులుగా, వారి జీవితానుభవాలనే పాఠాలుగా మలుచుకుంటున్నారు. నూతన వంగడాలు, ఆధునిక సాగు పద్ధతులను స్థానిక రైతులకు వివరిస్తూ, వారిలో వ్యవసాయంపై మరింత అవగాహన కల్పిస్తున్నారు. సంప్రదాయ పద్ధతులను, భూసారం, వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా వారు ఎదుర్కొంటున్న సవాళ్లను స్వయంగా తెలుసుకుంటున్నారు. పంట సాగుపై సందేహాలను నివృత్తి చేస్తూ, నేర్పుతూ–నేర్చుకుంటూ తమ వ్యవసాయ జ్ఞానాన్ని ద్విగుణీకృతం చేసుకుంటున్నారు. తమ మూడేళ్ల కళాశాల జీవితం.. అలాగే మూడు నెలల గ్రామ వాసం వెరసి రేపటి వ్యవసాయ రంగానికి పటిష్టమైన పునాది కానుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఆధునిక విధానాలపై రైతుల అనాసక్తి, పెట్టుబడి భారం పెరగడం, కౌలు వ్యవస్థతో సవాళ్లు, సాగుపై యువత అనాసక్తి చూపడం, రసాయనాల వినియోగం పెరగడం, సేంద్రియ పద్ధతులపై అపోహలు, రైతులకు ఆర్థిక భరోసా, సాంకేతిక శిక్షణ వంటి అంశాలపై వారు దృష్టి సారించారు.
క్షేత్రస్థాయిలో ‘రావే’
విద్యార్థుల అనుభవాత్మక శిక్షణ

తరగతి గది నుంచి పొలం వద్దకు..