
నేత్రదానంతో ఇద్దరికి కంటి చూపు
శావల్యాపురం: మండలంలోని వేల్పూరు గ్రామంలో సూరాబత్తుని హనుమంతరావు (58) అనారోగ్యంతో గురువారం మృతి చెందారు. కుటుంబ సభ్యులు అంగీకారంతో పెదకాకాని శంకర కంటి వైద్యశాలకు నేత్రదానం చేసినట్లు జిల్లా జనవిజ్ఞాన వేదిక జనరల్ సెక్రటరీ సండ్రపాటి చలపతిరావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హనుమంతరావు కార్నియాను ఇద్దరు అంధులకు అమర్చి కంటిచూపు వచ్చేలా చేస్తారన్నారు. మరణాంతరం ఎవరైనా పది గంటలలోపు నేత్రాలను దానం చేయవచ్చునన్నారు. ఈ కార్యక్రమంలో శంకర వైద్య నిపుణులు, కుటుంబ సభ్యులు సూరాబత్తుని హైమావతి, కోటేశ్వరరావు, బొల్లా రామకృష్ణ, ఏడుకొండలు, రాములు తదితరులు పాల్గొన్నారు.
నగరంపాలెం: పగలు పల్సర్ బైక్‌పై తిరుగుతూ తాళాలు వేసి ఇళ్లను గుర్తించి, రాత్రిళ్లు చోరీలకు పాల్పడే భార్యాభర్తలను కొల్లిపర పోలీసులు అరెస్ట్ చేశారని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ చెప్పారు. దంపతుల నుంచి 173.19 గ్రాముల బంగారం, 226.36 గ్రాముల వెండి, రూ.2.15 లక్షలు, ఒక మోటారు సైకిల్, టీవీ, ఇనుపరాడ్ స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. నగరంపాలెంలోని జిల్లా పోలీస్ కార్యాలయ (డీపీఓ) ఆవరణలో గురువారం ఆయన మీడియాకు కేసు వివరాలు వెల్లడించారు. ఇటీవల కొల్లిపర మండల పరిధిలోని తాళాలు వేసి ఇళ్లల్లో వరుసగా చోరీలు జరిగాయి. తూములూరు గ్రామ వాసి మాటూరి మధుసూదనరావు గతనెల 28న ఊరెళ్లారు. ఈనెల 2న ఇంటికి రాగా, బీరువాలో దాచిన బంగారు సొత్తు చోరీ చేశారు. దీనిపై బాధితులు కొల్లిపర పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. తెనాలి సబ్ డివిజన్ డీఎస్పీ బి.జనార్ధనరావు, రూరల్ సీఐ ఆర్.ఉమేష్ నేతృత్వంలో కొల్లిపర పీఎస్ ఎస్‌ఐ పి.కోటేశ్వరరావు ప్రత్యేక దర్యాప్తు చేపట్టారు. ఈ మేరకు పరిసరాల్లోని సీసీ కెమెరాల పుటేజీలు పరిశీలించారు. సాంకేతిక ఆధారాలతో కొల్లిపర గ్రామ వాసి కటారి వెంకటేశ్వర్లుగా గుర్తించారు. అతన్ని అదుపులోకి తీసుకుని విచారించారు. నేరం రుజువైంది. గతంలోనూ మండల పరిధిలోని పలు గ్రామాల్లో 13 చోరీలకు పాల్పడినట్లు గుర్తించారు. ఈ చోరీల్లో కొంత వరకు భార్య తేజ నాగమణికి ఇచ్చి భద్రపరిచేవాడు. దీంతో భార్యాభర్తలను అరెస్ట్ చేసి, 173.19 గ్రాముల బంగారం, 226.36 గ్రాముల వెండి, రూ.2.15 లక్షలు, పల్సర్ బైక్, ఒక టీవీ, ఇనుపరాడ్ స్వాధీనం చేసుకున్నారు.