
ఆదర్శనీయుడు వాల్మీకి మహర్షి
నరసరావుపేట రూరల్: మహాకావ్యం రామాయణాన్ని అందించిన మహాకవి వాల్మీకి మహర్షిని ఆదర్శంగా తీసుకుని జీవితంలో ముందుకు సాగాలని జిల్లా ఎస్పీ బి.కృష్ణారావు తెలిపారు. జిల్లా పోలీసు కార్యాలయంలో మంగళవారం వాల్మీకి మహర్షి జయంతిని ఘనంగా నిర్వహించారు. వాల్మీకి మహర్షి చిత్రపటానికి జిల్లా ఎస్పీ బి.కృష్ణారావు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుటుంబ, మానవతా విలువలు ప్రతిబింబించే విధంగా మహాకావ్యం రామాయణాన్ని రచించి సమాజానికి అందించారని తెలిపారు. ఉన్నతమైన ఆదర్శ భావాలను భోదించే మధురకావ్యంగా రామాయణాన్ని రచించి యుగాలు దాటినా నేటికీ సమాజానికి ఆదర్శంగా నిలుస్తుందన్నారు. వాల్మీకి మహర్షి ప్రబోధించిన ఆశయాలను, ఆలోచనలను గుర్తుచేసుకుంటూ సన్మార్గంలో నడవటమే ఆయనకు మనం ఇచ్చే నివాళి అని తెలిపారు. అదనపు ఎస్పీ(అడ్మిన్) జేవీ సంతోష్, అదనపు ఎస్పీ(ఏఆర్) వి.సత్తిరాజు, ఏఆర్ డీఎస్పీ మహాత్మాగాంధీ రెడ్డి, ఆర్‌ఐలు, సిబ్బంది పాల్గొన్నారు.