తాడికొండ: ఆసియా అభివృద్ధి బ్యాంకు(ఏడీబీ) బృందం రాజధాని అమరావతి పర్యటన వరసగా రెండో రోజు కొనసాగింది. విజయవాడలోని సీఆర్డీఏ కార్యాలయంలో కమిషనర్ కె.కన్నబాబు, అడిషనల్ కమిషనర్లు జి.సూర్యసాయి ప్రవీణ్ చంద్, అమిలినేని భార్గవ తేజ్‌లతో ఏడీబీ– వాటర్– అర్బన్ డెవలప్మెంట్ సెక్టార్ బృందంలోని సభ్యులైన నోరియా సైటో(సీనియర్ డైరెక్టర్), మనోజ్ శర్మ(డైరెక్టర్), సంజయ్ జోషి(ప్రిన్సిపాల్ అర్బన్ డెవలప్మెంట్ స్పెషలిస్ట్), అశ్విన్ హోసూర్ విశ్వనాథ్(సీనియర్ ప్రాజెక్టు ఆఫీసర్) సమావేశమయ్యారు.
అనంతరం అమరావతి సచివాలయంలో ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్, పురపాలక– పట్టణాభివృద్ధి శాఖ ప్రధాన కార్యదర్శి ఎస్.సురేశ్ కుమార్, పరిశ్రమలు– వాణిజ్య శాఖ కార్యదర్శి ఎన్.యువరాజ్, ఆర్థిక శాఖ కార్యదర్శి రొనాల్డ్ రాస్ ఐఏఎస్‌లను కలిశారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ ఐఏఎస్‌ను ఆయన చాంబర్‌లో ఏడీబీ బృందం కలిసినట్లు సీఆర్డీయే అధికారులు వెల్లడించారు. ఈ సందర్బంగా రాజధాని అమరావతి ప్రాజెక్టు పనులలో పురోగతి, ఏడీబీ అందజేస్తున్న ఆర్థిక సహకారం తదితర అంశాలను బృందంలోని సభ్యులు రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో చర్చించారు.
జీవ ఉత్ప్రేరకాల తయారీపై అవగాహన.. బ్రెజిల్ బృంద సభ్యులకు శిక్షణ
కొల్లిపర: ప్రకృతి వ్యవసాయం విధానాలు, జీవ ఉత్ప్రేరకాల తయారీపై బ్రెజిల్ బృందం సభ్యులు మంగళవారం పరిశీలించారు. ప్రకృతి వ్యవసాయంపై అధ్యయనం కోసం 25 మంది బ్రెజిల్ ప్రతినిధుల బృందం రాష్ట్రంలో పర్యటిస్తోంది. రైతు సాధికార సంస్థ ఆధ్వర్యంలో మండల పరిధిలోని అత్తోట, దావులూరిపాలెం గ్రామాల్లో పర్యటించారు. ఈసందర్భంగా రైతు సాధికార సంస్థ చీఫ్ టెక్నాలజీ మరియు ఇన్నోవేషన్ ఆఫీసర్ లక్ష్మనాయక్, బృందం సభ్యులకు బయో ఇన్పుట్‌ల తయారీ, ఘన జీవామృతం తయారీ విధానంపై అవగాహన కల్పించారు. ఏడాదిపాటు పంటలతో భూమిని కప్పి ఉంచడంతో పాటు ఏ గ్రేడ్, ఏ ఫ్లస్ గ్రేడ్, ఏ ఫ్లస్ ప్లస్ గ్రేడ్, ఏటీఎం, పీఎండీఎస్ వంటి మోడల్స్ అనుసరించడం వలన కలిగే అనేక రకాల ప్రయోజనాలను బృంద సభ్యులకు అవగాహన కల్పించారు.
దేశీ ఆవు, ప్రకృతి వ్యవసాయంలో కీలక పాత్ర పోషిస్తుందని ఆవు పేడ, మూత్రంలో అధికంగా లభించే సూక్ష్మ జీవులు, భూమి సారాన్ని పెంచి పంటల ఆరోగ్యాన్ని కాపాడతాయని చెప్పారు. బృందం సభ్యులను ఆవు దగ్గరికి తీసుకువెళ్లి ప్రత్యక్షంగా పేడ, మూత్రం సూక్ష్మజీవుల ప్రాధాన్యంపై వివరించారు. అనంతరం స్వయంగా బృందం సభ్యులు బీజామృతం, ద్రవ, జీవామృతం, విత్తన గుళికల తయారీపై తర్ఫీదు ఇచ్చారు. దావులూరిపాలెంలో న్యూట్రి గార్డెన్, ఫుడ్ బాస్కెట్, ఆరోగ్యం, పోషకాహార కార్యకలాపాల లబ్ధిదారులను కలసి నిర్వహణ, ఉపయోగాలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ప్రకృతి వ్యవసాయం జిల్లా ప్రాజెక్టు మేనేజర్ రాజకుమారి, రైతు సాధికార సంస్థ సీనియర్ అధికారులు జాకీర్ హుస్సేన్, కృష్ణారావు, వాణిశ్రీ పాల్గొన్నారు.

ఆసియా అభివృద్ధి బ్యాంకు బృందం పర్యటన

బ్రెజిల్ బృంద సభ్యులకు శిక్షణ