
‘సజ్జ’తో భూసారం.. అదనపు ఆదాయం
యడ్లపాడు: పొలంలో శనగ పంట వేయడానికి ముందు ఖాళీగా ఉంచే సమయాన్ని వినియోగించుకుంటూ సజ్జ పంట సాగు చేయడం రైతులకు అదనపు ఆదాయంతో పాటు భూసార వృద్ధికి దోహదపడుతుందని ఆచార్య ఎన్‌జి రంగా వ్యవసాయ విశ్వ విద్యాలయ పరిశోధన సంచాలకులు డాక్టర్ పీవీ సత్యనారాయణ స్పష్టం చేశారు. పల్నాడు ఏరువాక కేంద్రం నిర్వహించిన క్షేత్ర దినోత్సవం, రైతు సదస్సు కార్యక్రమాలు మండలంలోని జాలాది గ్రామంలో మంగళవారం నిర్వహించారు. ముందుగా గ్రామంలో సజ్జసాగు చేస్తున్న రైతు మానుకొండ శ్రీనివాసరావు మాట్లాడుతూ సజ్జపంట సాగు ఎంతో ఆశాజనకంగా ఉందని, ఎకరానికి దాదాపు 15 – 18 క్వింటాళ్ల దిగుబడి వచ్చే అవకాశం ఉందని, తద్వారా నికరంగా రూ. 25 వేల ఆదాయం పొందవచ్చని సదస్సులో రైతులకు వివరించారు. వ్యవసాయ విశ్వవిద్యాలయం రూపొందించిన ఏబీవీ 04 రకం సజ్జ అధిక దిగుబడులు ఇచ్చే అవకాశం ఉందని జాలాది రైతులు నిరూపించారని తెలిపారు. విస్తరణ విభాగం రాష్ట్ర సంచాలకులు డాక్టర్ జి.శివనారాయణ మాట్లాడుతూ వ్యవసాయ యాంత్రీకరణ, నూతన వంగడాల సాగు ద్వారా వ్యవసాయాన్ని వాణిజ్యం దిశగా తీసుకెళ్లవచ్చని ఆయన సూచించారు. సహ పరిశోధన సంచాలకులు డాక్టర్ ఎన్‌వీఎస్ దుర్గాప్రసాద్, చిరుధాన్యాల ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ సీవీ చంద్రమోహన్‌రెడ్డి, ఏరువాక కేంద్రం జిల్లా కో–ఆర్డినేటర్ డాక్టర్ ఎం.నగేష్, శాస్త్రవేత్త పీవీ సత్యగోపాల్, నరసరావుపేట ఏడీఏ కేవీ శ్రీనివాసరావు, ప్రకృతిసాగు విభాగం పీడీ డాక్టర్ కె.అమలకుమారి, అభ్యుదయ రైతులు దర్లు శంకరరావు, నిమ్మల శంకరరావు, పోపూరి శివరామకృష్ణ, గంటా రమేష్, జాగర్లమూడి రామారావు, ముద్ర పున్నారావు పాల్గొన్నారు.