
ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే చేనేత వస్త్రాలు కొనిపించ
సత్తెనపల్లి: చేనేత రంగాన్ని పరిరక్షించాలనే చిత్తశుద్ధి పాలకులకు ఉంటే దేశంలో ప్రతి ఒక్కరితో ఒక జత చేనేత దుస్తులు కొనిపించేటట్లు ప్రభుత్వాలు ప్రచారం చేయాలని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) రాష్ట్ర కార్యదర్శి ధూళ్ళిపాళ్ల రమాదేవి అన్నారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో రెండు రోజులుగా జరుగుతున్న ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం 11వ రాష్ట్ర మహాసభలలో ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మంగళవారం రెండవ రోజు సభలకు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు కట్టా శివ దుర్గారావు, నందం చంద్రకళ, కామార్తి రాజులు అధ్యక్షవర్గంగా వ్యవహరించారు. ఈ సందర్భంగా రమాదేవి మాట్లాడుతూ చేనేత కుటుంబాలలో చదువుకున్న పిల్లలకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేక భవన నిర్మాణ కార్మికుల గాను, ఇతర వృత్తులలో పని చేస్తూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. వారికి కనీసం నిరుద్యోగ భృతి అయిన ఇవ్వాలని డిమాండ్ చేశారు. చేనేత వృత్తిలో పనిచేస్తున్న మహిళలకు వచ్చే రూ. 100 ఆదాయంతో ఎలా బతకగలరని ఆమె ప్రశ్నించారు. నేడు రాష్ట్రంలో చేనేత కుటుంబాలు చాలా దుర్భరమైన జీవితాలను గడుపుతున్నాయన్నారు. చేనేత రంగాన్ని పరిరక్షించాలనే చిత్తశుద్ధి ప్రభుత్వాలకు ఉంటే చేనేత 11 రకాల రిజర్వేషన్లను ఉల్లంఘించిన యజమానులపై చర్యలు తీసుకొని, రిజర్వేషన్లు అమలు జరిపించేటట్లు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇటీవల చేనేత కార్మికులంతా మంత్రి లోకేష్‌ను కలసి రిజర్వేషన్లు అమలు జరిపించాలని కోరగా రిజర్వేషన్లు అమలు జరపటం ఎవరివల్లా కాదని మంత్రి లోకేష్ మాట్లాడడం సిగ్గుచేటన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ జీఎస్టీ తగ్గించామని ప్రచారం చేసుకో వటానికి కర్నూలు జిల్లా రాబోతున్నారని, ఆ సందర్భంగా చేనేతపై జీఎస్టీని రద్దు చేయాలని చేనేత కార్మికులంతా కోరాలన్నారు.
రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు గద్దె చలమయ్య మాట్లాడుతూ పాలకులు అనుసరిస్తున్న చేనేత వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా కార్మికులంతా ఐక్యంగా పోరాడాలని ఆయన పిలుపు నిచ్చారు. చేనేత కార్మిక సంఘం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి గంజి మురళి మాట్లాడుతూ చేనేత కార్మికుల పట్ల రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు చిన్నచూపు చూస్తున్నాయన్నారు. ఏపీ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి కూరపాటి రమేష్ మాట్లాడారు. అనంతరం రాష్ట్ర కార్యదర్శి పిల్లలమర్రి బాలకృష్ణ ప్రవేశపెట్టిన కార్యదర్శి నివేదికపై మహాసభలో పాల్గొన్న ప్రతినిధులు చర్చించి నివేదికను ఏకగ్రీవంగా ఆమోదించారు. ఈ సందర్భంగా భవిష్యత్తు కర్తవ్యాలను రూపొందించి 18 తీర్మానాలను మహాసభ ఏకగ్రీవంగా ఆమోదించింది.