
జిల్లాకు 1620 మెట్రిక్ టన్నుల యూరియా
నాదెండ్ల: సాతులూరులోని రైల్వే ఎరువుల రేక్ పాయింట్‌ను నరసరావుపేట ఏడీఏ కేవీ శ్రీనివాసరావు పరిశీలించారు. పల్నాడు జిల్లాకు సీఐఎల్ యూరియా 1620 మెట్రిక్ టన్నులు కేటాయించినట్లు తెలిపారు. అనంతరం సాతులూరులోని ఆవాస్ గోడౌన్లు తనిఖీ చేశారు. ఆయన మాట్లాడుతూ కేటాయించిన ఎరువులు సొసైటీలకు ప్రైవేటు డీలర్లకు సరఫరా చేసి రైతులకు సక్రమంగా పంపిణీ అయ్యేలా చూడాలని వ్యవసాయాధికారులను ఆదేశించారు. ఆయనతో పాటూ ఏఓ టి.శ్రీలత, ఏఈఓ జీపీ శ్రీనివాసరావు ఉన్నారు.
వినుకొండ: పల్నాడు జిల్లా వినుకొండ రూరల్ మండలం ఏనుగుపాలెం గ్రామంలో యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన గుంటూరు శివ (35)ను గుర్తుతెలియని వ్యక్తులు గ్రామ సమీప పొలాల్లో గడ్డపారతో పొడిచి హత్య చేసినట్లు సోమవారం గుర్తించారు. స్థానిక రైతులు ఇచ్చిన సమాచారంతో నరసరావుపేట డీఎస్పీ హనుమంతరావు, ఇన్‌చార్జి సీఐ బాలాజీ సంఘటనా ప్రాంతానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించి విచారణ చేపట్టారు. శివ హత్యపై విచారణ చేస్తున్నామని, త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తామని డీఎస్పీ తెలిపారు. మృతుడికి భార్య సుధతో పాటు ఇద్దరు పిల్లలు ఉన్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
మృతుడు ఒంగోలు వాసిగా గుర్తింపు
చిలకలూరిపేటటౌన్: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన సంఘటన సోమవారం వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణానికి చెందిన నంగనం రామకృష్ణ(44) కూలి పనులు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తుంటాడు.
వ్యక్తిగత పనుల నిమిత్తం గుంటూరు వచ్చాడు. ఆదివారం రాత్రి 10.30 సమయంలో గుంటూరు నుంచి ఒంగోలుకు బైక్‌పై వెళ్తున్న క్రమంలో పల్నాడు జిల్లా నాదెండ్ల మండలంలోని కుప్పగంజి వాగు సమీపంలో ఆగి ఉన్న వాహనాన్ని వెనుక నుంచి ఢీకొట్టాడు. ఘటనలో తీవ్ర గాయాలపాలైన రామకృష్ణను స్థానికులు చిలకలూరిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు. మృతుడి కుమారుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
మోతడక(తాడికొండ): ద్విచక్ర వాహనం ఢీకొని వృద్ధుడు మృతి చెందిన ఘటన తాడికొండ మండలం మోతడక గ్రామంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మోతడక గ్రామానికి చెందిన కొమ్మినేని సాంబశివరావు (67) ఆదివారం సాయంత్రం సచివాలయం సెంటర్‌లో రోడ్డు దాటుతున్నాడు. అమరావతి వైపు నుంచి వస్తున్న ద్విచక్ర వాహనం వేగంగా అతడిని ఢీకొట్టింది. తలకు బలమైన గాయం కావడంతో వెంటనే జీజీహెచ్‌కు తరలించారు. అప్పటికే అతడు మరణించినట్లు వైద్యులు తెలిపారు. మృతుడి కుమారుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ కె.వాసు తెలిపారు.

జిల్లాకు 1620 మెట్రిక్ టన్నుల యూరియా