
వైఎస్సార్ సీపీ ఫ్లెక్సీలు తొలగించిన పోలీసులు
దాచేపల్లి పోలీసుల తీరుపై వైఎస్సార్ సీపీ నేతల మండిపాటు నగర పంచాయతీ కమిషనర్ కార్యాలయం వద్ద ఆందోళన ఫ్లెక్సీల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని కమిషనర్ హామీ
దాచేపల్లి: పల్నాడు జిల్లా దాచేపల్లి నగర పంచాయతీ పరిధిలో వైఎస్సార్ సీపీకి చెందిన ఫ్లెక్సీలను సోమవారం పోలీసులు అకారణంగా తొలగించారు. ఎటువంటి అనుమతులు లేకుండా నగర పంచాయతీ నిండా టీడీపీ, జనసేన ఫ్లెక్సీలు ఉన్నప్పటికి వాటిజోలికి వెళ్లకుండా వైఎస్సార్ సీపీకి చెందిన ఫ్లెక్సీలను దాచేపల్లి సీఐ పి.భాస్కర్ దగ్గరుండి తొలగించటం వివాదస్పమైంది. సీఐ భాస్కర్ తీరుపై వైఎస్సార్ సీపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. వివరాల్లోకి వెళితే.. నగర పంచాయతీ చైర్‌పర్సన్ కొప్పుల సుబ్బమ్మ పెద్దకుమారుడు రవికుమార్ జన్మదినోత్సవం సందర్భంగా వైఎస్సార్ సీపీ కార్యాకర్తలు, నాయకులు నగర పంచాయతీలోని ప్రధాన కూడళ్లలో ప్లెక్సీలు ఏర్పాటు చేశారు. రవికుమార్‌కి అభినందనలు తెలియజేస్తూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి ఫొటోలతో కూడిన ప్లెక్సీలు ఏర్పాటు చేశారు. అయితే ఏర్పాటు చేయడమే ఆలస్యం అన్నట్లుగా.. తొలగించేందుకు సీఐ భాస్కర్ రంగంలోకి దిగారు. దాచేపల్లి బస్టాండ్ సెంటర్, నారాయణపురం ఆర్‌అండ్‌బీ బంగ్లా సెంటర్, ముత్యాలంపాడు రోడ్డు సెంటర్‌లలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను యుద్ధప్రాతిపదికన తొలగింపజేశారు. విషయం తెలుసుకున్న వైఎస్సార్ సీపీ శ్రేణులు తొలుత నగర పంచాయతీ కార్యాలయం వద్దకు చేరుకుని ఆందోళన చేశారు. అనంతరం కమిషనర్ జి.వెంకటేశ్వర్లుతో నాయకులు మాట్లాడారు.