
ఎస్‌ఐ అనుచిత ప్రవర్తనపై ఫిర్యాదు
నరసరావుపేట రూరల్: బతుకమ్మ వేడుకల్లో తమను దుర్భాషలాడి, అనుచితంగా ప్రవర్తించిన పిడుగురాళ్ల రూరల్ ఎస్‌ఐ అనిల్‌పై చర్యలు తీసుకోవాలని పిడుగురాళ్ల మండలం కోనంకి గ్రామానికి చెందిన మహిళలు జిల్లా అదనపు ఎస్పీ(అడ్మిన్) జేవీ సంతోష్ కలిసి ఫిర్యాదు చేశారు. గత 30 సంవత్సరాలుగా గ్రామంలో బతుకమ్మను ఏర్పాటుచేసి పూజలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈ ఏడాది కూడా బతుకమ్మను పూజించి ఈనెల 2వ తేదీన దసరా పండుగ రోజున గ్రామంలో నిమజ్జన ఊరేగింపు ఏర్పాటుచేసామని పేర్కొన్నారు. ఈ సమయంలో ఎస్‌ఐ అనిల్ గ్రామానికి చెరుకుని మైక్‌కు అనుమతి లేదని ఊరేగింపును నిలిపివేశాడని ఫిర్యాదులో తెలిపారు. కొన్ని సంవత్సరాలుగా సాంప్రదాయంగా జరుపుకొనే వేడుకను అడ్డుకోవద్దని కోరినట్టు వివరించారు. తనకు రూ.20వేలు చెల్లించి ఊరేగింపు జరుపుకోమని ఎస్‌ఐ చెప్పడంతో, స్థానిక మహిళల నుంచి అప్పటికప్పుడు రూ.10వేలు వసూళ్లు చేసి రామాలయం సెంటర్‌లో ఎస్‌ఐకు అందజేసి ఇంతకంటే మేము ఇవ్వలేమని చెప్పినట్టు మహిళలు పేర్కొన్నారు. ఎస్‌ఐ అనుమతితో గ్రామంలో ఊరేగింపు ప్రారంభించినట్టు తెలపారు. రాత్రి 9గంటల సమయంలో జమ్ము చెట్టు సెంటర్‌కు చేరుకున్న ఊరేగింపును ఎస్‌ఐ అడ్డుకుని మిగిలిన రూ.10వేలు చెల్లించాలని డిమాండ్ చేశాడని ఫిర్యాదులో వివరించారు. రోజువారి పనులు చేసుకుని జీవించే వారమని అంతకన్నా ఇవ్వలేమని చెప్పినా ఎస్‌ఐ వినకుండా మహిళలను దుర్భాషలాడటంతో పాటు అసభ్యంగా ప్రవర్తించాడని తెలిపారు. ఎస్‌ఐ తీరుతో మహిళలు ఆయనను చుట్టుముట్టి ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగిందన్నారు. తనకు డబ్బులు ఇవ్వకపోయినా, చెప్పినట్టు చేయకపోయినా కేసులు తప్పవని మాపై బెదిరింపులకు పాల్పడ్డాడని పేర్కొన్నారు. గతంలో ఎన్నడూ ఇలాంటి పరిస్థితిని ఎదుర్కోలేదని తెలిపారు. మహిళల పట్ల అనాగకరికంగా వ్యవహరించిన ఎస్‌ఐ అనిల్‌పై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు. జిల్లా అదనపు ఎస్‌పిని కలిసిన వారిలో పుణ్యాల అర్చనకుమారి, చలవాది లక్ష్మీ, పుణ్యాల విజయమ్మ తదితరులు ఉన్నారు.
ఏఎస్పీకి ఫిర్యాదుచేసిన పిడుగురాళ్ల మండలం కోనంగి గ్రామ మహిళలు