
గిరిజన శాఖ మంత్రి రాజీనామా చేయాలి
చిలకలూరిపేట: గిరిజన గురుకుల పాఠశాలల్లో సమస్యలు పరిష్కరించటంలో విఫలమైన గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి తన పదవికి రాజీనామా చేయాలని ఏపీ గిరిజన సమాఖ్య రాష్ట్ర సహాయ కార్యదర్శి బి.శ్రీనునాయక్ డిమాండ్ చేశారు. గిరిజన పాఠశాలల్లో నెలకొన్న సమస్యలకు సంబంధించి గిరిజన సమాఖ్య ఆధ్వర్యంలో సోమవారం తహసీల్దార్ మొహమ్మద్ హుస్సేన్‌కు వినతిపత్రం అందజేశారు. ఆయన మాట్లాడుతూ అల్లూరి జిల్లా చింతపల్లి మండలంలోని గిరిజన సంక్షేమం ఆశ్రమ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థినిపై లైంగిక దాడి ఎంతో బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సంఘటనపై సంబంధిత అధికారులు సకాలంలో స్పందించకపోవడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్వతీపురం మన్యం జిల్లా కురుపాంలో గిరిజన ఏకలవ్య బాలికల పాఠశాలలో ఆహారం తిని 40 మంది విద్యార్థులు చికిత్స పొందుతున్నారని, ఇది ప్రభుత్వ నిర్లక్ష్యానికి అద్దం పడుతుందన్నారు. ఈ సంఘటన ఇద్దరు విద్యార్థులు మృతి చెందటం అధికారుల బాధ్యతారాహిత్యానికి నిదర్శమని విమర్శించారు. చనిపోయిన విద్యార్దినిల కుటుంబాలకు కూటమి ప్రభుత్వం తగు న్యాయం చేయాలన్నారు. మరో పక్క చిలకలూరిపేట పట్టణ శివారులోని పురుషోత్తమపట్నంలో ఉన్న గిరిజన పాఠశాల నూతన భవనాలను కమ్మవారిపాలెం గ్రామం వద్ద 2.5 ఎకరాలు కేటాయించటం జరిగిందన్నారు. ఇందుకు సంబంధించి రూ. 4కోట్లతో ప్రణాళికలు రూపొందించినప్పటికీ నిర్మాణానికి మాత్రం నోచుకోవడంలేదని విమర్శించారు. ప్రస్తుతం ఉన్న గిరిజన గురుకుల పాఠశాల విద్యార్థులు మరుగుదొడ్లు ఆధ్వానంగా ఉండి ఇబ్బందులు పడుతున్నారని వెల్లడించారు. తక్షణమే మరుగుదొడ్ల సమస్య పరిష్కరించాలని కోరారు. అఖిలభారత యువజన సమాఖ్య నాయకుడు బి.రాంబాబునాయక్, పాలపర్తి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
గిరిజన సమాఖ్య రాష్ట్ర సహాయ కార్యదర్శి బి.శ్రీనునాయక్